రైతును ఆదుకున్న సన్నీలియోని..!    - MicTv.in - Telugu News
mictv telugu

రైతును ఆదుకున్న సన్నీలియోని..!   

February 14, 2018

సన్నీలియోని అనగానే ఆమె ఒక పోర్న్‌స్టార్ నుండి బాలీవుడ్ హీరోయిన్‌గా టర్న్ తీసుకుందని చెప్తారు. కానీ ఇప్పుడామె ఒక దిష్టిబొమ్మగా కూడా కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నది. ఇంతకీ సన్నీకి ఈ ఆఫర్ ఇచ్చింది ఎవరనుకుంటున్నారూ.. ఓ సాధారణ రైతు.. నెల్లూరు జిల్లాలోని బండకిందపల్లి గ్రామానికి చెందిన అంకినపల్లి చెంచురెడ్డి. అతనికి  పదెకరాల పంటభూమి ఉంది. ఈ పంటభూమి రోడ్డు పక్కనే ఉంది. ఆ భూమిలో కూరగాయలు పండిస్తూ భారీ దిగుబడులు సాధిస్తున్నాడు. అధిక దిగుబడులు ఎలా సాధిస్తున్నావని తోటి రైతులు అతణ్ని అడుగుతున్నారట. దారిన పోయేవాళ్ళంతా ఆ పొలాన్ని చూస్తూ వెళ్తుండటంతో తన పొలానికి నరుల దిష్టి తగిలేలా వుందనుకున్నాడు.

అంతే..  గడ్డి, గుడ్డలు, కర్ర, కుండతో ఓ దిష్టిబొమ్మను తయారుచేసి పెట్టాలి కదా.. కానీ చెంచురెడ్డి అలా చెయ్యలేదు. నరుల అసూయ దృష్టిని పూర్తిగా మళ్లించడానికి మామూలు దిష్టిబొమ్మలు సరిపోవు. సన్నీలియోని దిష్టిబొమ్మను చెయ్యాలని అనుకున్నాడు.  నెల్లూరులోని ఓ ప్రింటింగ్ షాప్‌కి వెళ్ళాడు. గూగుల్లో సన్నీలియోని ఇమేజ్‌లను సెర్చ్ చేయించాడు. అందులో ఎర్ర బికినీలో వున్న హాట్ ఫోటోను సెలెక్ట్ చేసుకొని ప్లెక్సీ ప్రింట్ చేయించుకున్నాడు.పైగా దాని మీద ‘ ఒరేయ్.. నన్ను చూసి ఏడవకురా ’ అని రాయించాడు కూడా. చక్కా తీసుకెళ్లి పొలంలో పెట్టాడు. ఇంకే దారిన పోయే దానయ్యలందరూ ఇప్పుడు చెంచురెడ్డి పొలాన్ని కాకుండా సన్నీలియోని ప్లెక్సీని చూసి తరిస్తున్నారు. దీంతో తన పొలం మీద ఎవరి కన్నూ పడట్లేదని ఆ రైతు చెబుతున్నాడు. సన్నీ లియోని సినిమా నిర్మాతలకే కాదు రైతులకు కూడా ఇలా పరోక్షంగా ఉపయోగపడుతోందని నెటిజర్లు అంటున్నారు.