హ్యాండ్ గ్రెనేడ్‌తో సెల్ఫీ.. ప్రాణమే తీసేసింది... - MicTv.in - Telugu News
mictv telugu

హ్యాండ్ గ్రెనేడ్‌తో సెల్ఫీ.. ప్రాణమే తీసేసింది…

November 29, 2017

యువతలో సెల్ఫీల పిచ్చి రోజురోజుకూ ముదురుతోంది తప్పితే తగ్గటం లేదు. సెల్ఫీలు దిగటంలో ట్రెండ్ సృష్టించాలని చూసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఒక యువకుడు హ్యాండ్ గ్రెనేడ్‌ను చేతిలో పట్టుకొని సెల్ఫీ దిగటానికి ప్రయత్నించాడు. అది ప్రమాదావశాత్తు పేలి చనిపోయాడు. ఇలాంటి సంఘటనలు ఎన్ని చదువుతున్నా ఎవ్వరూ మారటం లేదు. సెల్ఫీ మోజులో ప్రాణార్పణం చేస్తున్నారు.

   

రష్యాకు చెందిన అలెగ్జాండర్ ఛెచిక్ తన స్నేహితులతో కలిసి సెల్ఫీలు దిగుదామనుకున్నాడు. ఎప్పడూ ఒకేలా కాకుండా కొత్తగా సెల్ఫీ దిగాలని చేతిలో హ్యాండ్ గ్రెనేడ్‌ను పట్టుకున్నాడు. పట్టుకుంటే పట్టుకున్నాడు గానీ దాని పిన్‌ను తీసి పట్టుకొన్నాడు. అప్పటికీ తన స్నేహితులు ‘ ఒరేయ్ అలా పిన్ తీస్తే ప్రమాదంరా ’ అని ఎంత హెచ్చరించినా వాళ్ళ మాట లెక్క చెయ్యలేదు. పిన్ తీసినంత మాత్రాన గ్రెనేడ్ పేలుతుందని అతను ఊహించలేదు.

తన సెల్ఫీ సోషల్ మీడియాలో బోలెడన్ని లైకులు, లెక్కకు మించిన కామెంట్లను, విపరీతమైన షేర్లను పొందడమే లక్ష్యంగా సెల్ఫీకి పోజు పెట్టాడు. హ్యాండ్ గ్రెనేడ్ పిన్ తీయడంతో అది అతని చేతిలోనే పేలింది. అంతే క్షణాల వ్యవధిలోనే అలెగ్జాండర్ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. అతని సరదానే అతని ప్రాణసంకటంగా మారింది. ఇది ఆత్మహత్య కాదని, పొరపాటున జరిగిన ప్రమాదమని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా  సెల్ఫీల మాయలో పడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని పోలీసులు హితవు పలికారు.