దొంగతో సెల్ఫీ.. 2,500 మాత్రమే.. - MicTv.in - Telugu News
mictv telugu

దొంగతో సెల్ఫీ.. 2,500 మాత్రమే..

April 13, 2018

దొంగల్లో కూడా సెలబ్రిటీలు వుంటారనటానికి ఈ ఘరానాదొంగే నిదర్శనం. తనతో ఏ దొంగ సెల్ఫీ దిగాలన్నా రూ. 2,500 చెల్లించాల్సిందే. అందులో రూపాయి తక్కువ అయినా నో సెల్ఫీ అంటారీయన. దొంగగారి సెల్ఫీ భాగోతం గురించి తెలిసిన పోలీసులు ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకున్నారు. ‘ వార్నీ వీడు సెలబ్రిటీలను మించి పోయాడు కదా ’ అనుకుని కంగు తిన్నారు. ఢిల్లీ నగరంలోని నజాఫ్‌ఘడ్ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల విక్రమ్ పూనియా ఘరానా దొంగగా అనతి కాలంలోనే పేరు సంపాదించుకున్నాడు. తను ఒక ముఠాగా ఏర్పడాలని సాగర్, ఆకాశ్‌లను కలుపుకుని మరో ఇద్దరు మైనర్ దొంగలతో ముఠాగా ఏర్పడ్డాడు.

విదేశీ బీరు,  సిగరెట్లు తాగుతూ స్థానికంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. చిన్న వయసులోనే దోపిడీలు, దొంగతనాలు చేస్తూ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు విక్రమ్. పథకం ప్రకారం ఢిల్లీ డీసీసీ షిబేష్ సింగ్ నేతృత్వంలోని పోలీసుబృందం విక్రమ్‌ను పట్టుకుంది. ఢిల్లీలో ఓలా కారును బుక్ చేసి క్యాబ్ డ్రైవరును తుపాకీతో బెదిరించి కారు చోరీ చేసిన ఈ ముఠా పోలీసులకు దొరికింది. చోరీ చేసిన కారులో పాండవుల గ్రామం వైపు పోతుండగా, వీరి దొంగల ముఠా సభ్యుడు చోరీ చేసిన మరో ద్విచక్రవాహనంపై అనుసరించాడు. ఔటర్ ఢిల్లీలో జటిక్రా గ్రామంలో విక్రమ్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.

పట్టుకొని ప్రశ్నిస్తే ఆయన గురించి సంచలన వాస్తవాలు వెలుగుచూశాయి. చోరకళ మీద స్థానికంగా కొందరిని దొంగలుగా తీర్చిదిద్దుతున్నాడట విక్రమ్. ఈ ఢిల్లీ గ్యాంగస్టర్‌తో సెల్ఫీ తీసుకునేందుకు స్థానిక దొంగలు తెగ ఆరాటపడేవారని పోలీసుల ఇంటరాగేషన్ లో వెలుగుచూసింది. తను అడిగినంత పేమెంట్ చెల్లించకపోతే సెల్ఫీ దిగటానికి నిరాకరిస్తాడని తెలిసి నిర్ఘాంతపోయారు పోలీసులు. 12వతరగతి వరకు చదువుకున్న విక్రమ్ దొంగల ముఠా నాయకుడిగా పలు లూఠీలు చేసినట్టు విచారణలో తేలింది. తన తల్లి, చెల్లితో అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నట్టు విచారణలో వెల్లడైంది.