అభిమాని ఆఖరి కోరిక తీర్చని షారూఖ్ - MicTv.in - Telugu News
mictv telugu

అభిమాని ఆఖరి కోరిక తీర్చని షారూఖ్

October 24, 2017

బాలీవుడ్  కింగ్‌ఖాన్  షారూఖ్‌ ఖాన్ ఓ తల్లి ఆఖరి కోరిక తీర్చలేక పోయాడు. తీవ్ర అనారోగ్యంతో  బాధపడుతూ జీవితపు చివరి అంచుల్లో కొట్టుమిట్టాడుతున్న  అరుణ పీకే అనే మహిళ, తన ఆఖరి కోరికగా తన అభిమాన నటుడు షారూఖ్ ఖాన్‌ను కలవాలనుకుంది, ‘దయచేసి తమ తల్లి ఆఖరి కోరిక తీర్చాలని’  ఆమె పిల్లలు షారూఖ్‌కు కబురు పంపారు.

కానీ షూటింగ్ బిజీ వల్ల షారూఖ్ ఆమెను కలవలేకపోయాడు. కానీ ఆమె కోసం ఓ వీడియో సందేశాన్ని పంపించాడు. ‘మీ ఆరోగ్యం బాగుపడి, త్వరలోనే మీరు పూర్తిస్థాయిలో కోలుకోవాలని మీ కుటుంబసభ్యులు, స్నేహితులు,నేనూ మేమందరం  ప్రార్థిస్తున్నామని’ షారుఖ్ ఆ వీడియో ద్వారా అరుణకు సందేశాన్ని పంపించాడు. అంతేకాకుండా మీరు పూర్తిగా కోలుకున్న తర్వాత తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను అని ఆ వీడియోలో స్పష్టంచేశాడు. కానీ దురదృష్టవశాత్తు  క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ చివరిగా తన అభిమాన నటుడు షారుఖ్ ఖాన్‌ని కలవాలని కోరుకున్న అరుణ, తన చివరి కోరిక తీరకుండానే తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలిసిన షారుఖ్.. అరుణ కుటుంబసభ్యులని ఓదార్చుతూ వారికి ట్విటర్ ద్వారా ఓ సంతాప సందేశాన్ని పంపించాడు. ‘తల్లిని కోల్పోవడం అనేది ఎంత బాధాకరమో తనకి తెలుసు, కానీ అమ్మ ఎప్పుడూ మీతోనే వుంటుంది. స్వర్గంలో వున్న మీ తల్లి ఆత్మ సంతోషించేంత గొప్పగా మీరు బతకాలి అంటూ వారికి ధైర్యాన్ని చెప్పాడు షారుఖ్.