షీటీమ్స్ చొరవతో వీడి పాపం పండింది - MicTv.in - Telugu News
mictv telugu

షీటీమ్స్ చొరవతో వీడి పాపం పండింది

March 22, 2018

అతని పనే అది అమ్మాయిలను ప్రేమిస్తున్నానని నమ్మించి వారి ఫోటోలు, వీడియోలు తీయటం.. వాటిని సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి డబ్బులు లాగటం.. ఇది అతనికి నిత్యకృత్యమైంది. అమ్మాయిలు చాలా మంది అతని వలకు చిక్కి విలవిలాడారు. కానీ ఓ అమ్మాయి ధైర్యంగా షీటీమ్స్‌ వారికి ఫిర్యాదు చేయటంతో అతణ్ణి అరెస్ట్ చేశారు. కలవరానికి గురిపెడుతున్న ఈ ఘటన హైదరాబాద్ నగరం నడిబొడ్డున జరిగింది. ఈమధ్య అమ్మాయిలను ప్రేమ పేరుతో మోసం చేసి వారిని ఇలా ఫోటోలు, వీడియోలతో బెదిరించటం కొందరు బట్టెబాజ్‌గాళ్ళకు పరిపాటైంది. అమ్మాయిలు వాళ్ళ బెదిరింపులకు భయపడకుండా పోలీసులను ఆశ్రయిస్తే తప్పకుండా న్యాయం, రక్షణ జరుగుతుందని ఈ ఘటన నిరూపించింది. మహిళల పట్ల రక్షణగా వున్న షీటీమ్స్ వుండగా ఎవరూ ఎవడికీ భయపడాల్సిన అవసరం లేదని వారు భరోసా ఇస్తున్నారు.పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ గోల్కొండ ప్రాంతానికి చెందిన అల్తాఫ్‌ఖాన్ అనే యువకుడు అమ్మాయిలను ప్రేమ పేరుతో మోసం చేస్తున్నాడు. వారితో సీక్రెట్‌గా దిగిన ఫోటోలను ఫేస్‌బుక్‌లో  పెడతానంటూ పలువురు అమ్మాయిలను బెదిరించి డబ్బులు లాగేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. బాధిత అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన షీటీమ్స్ పోలీసులు

నిందితుణ్ణి వలపన్ని పట్టుకున్నారు. గోల్కొండ సమీపంలోని టోలీచౌకి చౌరస్తా వద్ద అల్తాఫ్‌ఖాన్‌ను రెడ్ హ్యాండెడ్‌గా  పట్టుకున్నారు. అతనితో పాటు మరో యువకుడిని కూడా అరెస్ట్ చేశారు. అల్తాఫ్ గతంలోనూ అమ్మాయిలను వేధించిన కేసులో అరెస్టయ్యాడు.