ఛీ ఇదేం సినిమా ? - MicTv.in - Telugu News
mictv telugu

ఛీ ఇదేం సినిమా ?

February 12, 2018

‘ పద్మావత్ ’ సినిమాను కొన్ని రాష్ట్రాలు విడుదల కానివ్వమన్నాయి. కానీ పాకిస్తాన్ మాత్రం క్లీన్‌యూ సర్టిఫికేట్ ఇచ్చి మరీ అక్కడ విడుదల చేసి విస్మయానికి గురి చేసింది. కానీ ‘ ప్యాడ్ మ్యాన్ ’ సినిమా విషయంలో విడుదల చెయ్యొద్దంటోంది. ‘ ఛీ ఇదేం సినిమా ? ఇది మా ఆచారాలకు, సంప్రదాయాలకు వ్యతిరేకంగా వుంది. కావున మా దగ్గర ఈ సినిమా ప్రదర్శించడానికి ఒప్పుకోము ’ అని ఖరాఖండిగా చెప్పేసింది పాక్ సెన్సార్ బోర్డ్. మహిళల రుతుక్రమంపై చర్చిస్తూ, ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన పరిశుభ్రతపై అవగాహన పెంచుతూ అక్షయ్ కుమార్ నటించిన ఈ సినిమా ఓ వైపు బాక్సాఫీసు వద్ద దూసుకెళుతుండగా, అసలు ఈ చిత్రాన్ని చూసేందుకు కూడా పాకిస్థాన్ సెన్సార్ బోర్టు సభ్యులు నిరాకరించినట్టు తెలుస్తోంది.ఈ విషయమై దర్శకుడు ఆర్. బాల్కీ తన ఆవేదనను వ్యక్తం చేశారు. ‘ మహిళల ఆరోగ్యానికి సంబంధించిన రుతుక్రమంపై తీసిన సినిమా సంప్రదాయాలకు విరుద్ధమని ఎలా చెప్తారు ? ఆసియాలో నెలసరి సమస్యలతో ఎందరో మహిళలు మరణించారు. మహిళలకు ఈ చిత్రం చాలా అవసరం ’ అన్నారు. కాగా పాక్ సెన్సార్ బోర్టు ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని స్పష్టం చేస్తుండటం గమనార్హం. పలువురు బోర్టు సభ్యులు సినిమా చూడాలని కోరితే ఎవరికి వారు ‘ఛీ’ అంటూ పక్కకు తప్పుకున్నారట. తమ సినిమా విషయంలో పాక్ తీరుపై ‘ ప్యాడ్ మ్యాన్ ’ చిత్ర యూనిట్ బాధపడుతున్నారు.