పవన్ దుమ్మెత్తిపోస్తే నేను దులుపుకోవాలా ? - MicTv.in - Telugu News
mictv telugu

పవన్ దుమ్మెత్తిపోస్తే నేను దులుపుకోవాలా ?

March 20, 2018

‘ పవన్ దుమ్మెత్తిపోస్తే నేను దులుపుకుని పోవాలా ? ’ అంటూ ఏపీ ఐటీశాఖ మంత్రి లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు. గుంటూరులో ఇటీవల జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ కల్యాణ్ మంత్రి లోకేష్‌పై, ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శలు ఎక్కు పెట్టిన విషయం తెలిసిందే. ఈ విమర్శలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. లోకేష్ కూడా తొలిసారిగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంటే నాలుగేళ్ళుగా పవన్ కల్యాణ్ ఎందుకు తమ దృష్టికి తీసుకురాలేదని లోకేష్ ప్రశ్నించారు. ‘ నాపై, ఏపీ సీఎంపై పవన్ నిరాధార ఆరోపణలు చేశారు. ఆయన చేసిన ఆరోపణల్లో వాస్తవం కొంత కూడా లేదు. మాపై విమర్శలు చేసి తన స్థాయిని తగ్గించుకున్నారు. ఎవరేమిటో ఏపీ ప్రజలకు తెలుసు.టిటిడి మాజీ సభ్యుడు శేఖర్‌రెడ్డితో తనకు సంబంధాలను అంటగట్టడం కాదు పవన్ దగ్గర ఆధారాలుంటే నిరూపించాలి. ఏపీ ప్లానింగ్ కమిషన్ సభ్యుడు పెద్ది రామారావును చూసి శేఖర్‌రెడ్డిగా పవన్ భ్రమ పడ్డారేమో. దివంగత ఏపీ సీఎం ఎన్టీఆర్‌కు నేను చెడ్డపేరును తీసుకొస్తున్నానని విమర్శలు చేశారు.  అవి నాకు బాధ కలిగించాయి. నేను పుట్టే సమయానికే ఏపీ రాష్ట్రానికి ఎన్టీఆర్ సీఎంగా ఉన్నారు. తాతకు ఏనాడూ కూడ చెడ్డపేరు తీసుకురాను. ఎప్పటికప్పుడు మా ఆస్తులను ప్రకటిస్తున్నాం. నేను ప్రకటించిన ఆస్తుల కంటే చిల్లిగవ్వ ఎక్కువ ఉన్నా వాటిని పవన్‌కు రాసిస్తా. రాష్ట్రం కోసం రాత్రింబవళ్ళు కష్టపడుతున్న చంద్రబాబుకు పవన్ రేటింగ్ ఇవ్వడం అనవసరం ’ అని మండిపడ్డారు లోకేష్. ఇలాగే పవన్ నిరాధార ఆరోపణలు చేస్తే ఆయనపై పరువు నష్టం దావా వేసే విషయాన్ని పార్టీ నిర్ణయం తీసుకొంటుందని మంత్రి లోకేష్ చెప్పారు.