చెప్పుతో కొట్టి మరీ పెళ్లి చేసుకుంది.. - MicTv.in - Telugu News
mictv telugu

చెప్పుతో కొట్టి మరీ పెళ్లి చేసుకుంది..

January 31, 2018

ప్రేమంటే ప్రేమించడం..  బోరనిపిస్తే..  మరొకరి ప్రేమలో పడటం అనడానికి ఈ ప్రేమకథే ఉదాహరణ. కర్నూలు జిల్లా పాణ్యం మండలం రాంభూపాల్ రెడ్డి తండాకు చెందిన ఓ యువతిని, నంద్యాల మండలం కానాలకు చెందిన చంద్రశేఖర్ ప్రేమ పేరుతో వెంబడించాడు. ఆమె అందాన్ని వర్ణిస్తూ వెంటపడ్డాడు. ఆమె చిరాకు పడింది. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా ఆమెను వెంబడించడం మానలేదు. సరిగ్గా ఇక్కడే ఆ యువతి బోల్తా కొట్టింది. అతడు తనను గాఢంగా ప్రేమిస్తున్నాడనుకొని అతని ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.కొన్నేళ్ళు ప్రేమించుకున్నారు. ఇద్దరూ కలిసి కడపలో  ఓ గది తీసుకొని సహజీవనం చేశారు. కొంత కాలానికి ప్రియురాలి మీద అతనికి మొహం మొత్తింది. బోర్ అనిపిస్తే పాత వస్తువును పారేసి కొత్త వస్తువును తీసుకుందామన్నట్టు ఇంకో అమ్మాయితో చనువుగా వుండటం మొదలు పెట్టాడు చంద్రశేఖర్. మెల్లగా ఈమెకు దూరంగా వుంటున్నాడు. తనను కాదని వేరే అమ్మాయితో వుంటున్నది గమనించిన ఆ యువతి  అయ్యో నేను మోసపోయాననుకొని ఉసూరుమనలేదు.

వేరే యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడని తెలిసి ఆ యువతి పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. తరువాత అతని ఇంటికి వెళ్లి ప్రియుణ్ణి నిలదీసింది. మా అమ్మానాన్నలు చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని తాపీగా సమాధానం చెప్పాడు. తమ ప్రేమ విషయాన్ని అతని తల్లిదండ్రులకు చెప్పింది. వారు కూడా చాలా నిర్లక్ష్యంగా మాట్లాడారు. మా అబ్బాయికి వేరే అమ్మాయితోనే పెళ్లి చేస్తామనేసరికి ఆ యువతి భద్రకాళిలా మారింది. మూడేళ్ళు తనతో సహజీవనం చేసి వదిలేస్తే నేను వూరుకుంటానా అని.. చెప్పు చేత పట్టుకొని తల్లిదండ్రుల ముందే ప్రియుడి చెంపలు ఛెళ్లుమనిపించింది. అడ్డొచ్చిన వారినల్లా ఈడ్చి ఈడ్చి కొట్టింది.

ప్రియురాలి చెప్పుదెబ్బలకు ప్రియుడు స్పృహలోకి వచ్చాడు. తను చేసింది నిజంగా తప్పే అని కళ్ళు తెరుచుకున్నాడు. చివరికి తల్లిదండ్రుల ముందు ప్రియురాలినే పెళ్లాడతానని చెప్పి ఆ యువతితో రాజీకొచ్చాడు. ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో స్థానిక సుంకులమ్మ ఆలయంలో చంద్రశేఖర్ ఆ యువతి మెడలో మూడు ముళ్లు వేశాడు. ప్రియుడు మోసం చేస్తే అది నా కర్మ అని బాధ పడకుండా ఈ యువతి చేసిన సాహసానికి స్థానికులు మెచ్చుకుంటున్నారు.