కొండల్లో ఇండియా సెంచరీ.. 100వ ఎయిర్‌పోర్టు షురూ - MicTv.in - Telugu News
mictv telugu

కొండల్లో ఇండియా సెంచరీ.. 100వ ఎయిర్‌పోర్టు షురూ

September 24, 2018

సిక్కిం సుదీర్ఘ స్వప్నం నెరవేరింది. ఆ రాష్ట్రంలో తొలి విమానాశ్రయం ఎట్టకేలకు ఈ రోజు ప్రారంభమైంది. దీంతో మన దేశంలోని విమానాశ్రయాల సంఖ్య వందకు చేరింది. ఈ ఎయిర్‌పోర్ట్‌ను ప్రధాని మోదీ సోమవారం ప్రారంభించారు. ఇప్పటి వరకు సిక్కింలో తప్ప.. దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాల్లో విమానాశ్రయాలు ఉన్నాయి. సిక్కింలోని పాక్యాంగ్‌లో ఏర్పాటు చేసిన ఎయిర్ పోర్ట్ నుంచి అక్టోబర్ 4వ తేదీ నుంచి  వాణిజ్య విమానాలు నడవనున్నాయి. స్పైస్‌జెట్ కోల్‌కతా నుంచి సిక్కింకు రోజు విమానం నడవనుంది.

ఇదివరకు సిక్కింకు వెళ్లాలంటే… పశ్చిమ బెంగాల్‌లోని బగ్డోగ్రా విమానాశ్రయానికి వెళ్లి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గ్యాంగ్‌టక్ వెళ్లేవారు. పాక్యాంగ్ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఇక నుంచి విమానం, హెలికాప్టర్లలో నేరుగా సిక్కిం చేరుకోవచ్చు.

Sikkim Airport is nine years old

నిర్మాణానికి తొమ్మిదేళ్లు..

హిమాలయ రాష్ట్రమైన సిక్కింలో పర్వతాలు అధికంగా ఉంటాయి. ఎలాగైనా ఇక్కడ విమానాశ్రయం నిర్మించాలనుకున్న ప్రభుత్వం సీనియర్ ఇంజినీర్ల సహాయంతో దిగ్విజయంగా ఎయిర్ పోర్టును పూర్తి చేసింది. దీని నిర్మాణానికి 2009లో శంకుస్థాపన జరిగింది. పాక్యాంగ్ విమానాశ్రయాన్ని 201 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. మొత్తం రూ.60 5కోట్ల వ్యయంతో దీన్ని పూర్తి చేశారు. సముద్రమట్టానికి 4,500 అడుగుల ఎత్తులో ఈ విమానాశ్రయం ఉంది. పాక్యాంగ్ గ్రామానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో పర్వత ప్రాంతంలో దీన్ని నిర్మించారు. ఏటీసీ టవర్ కమ్ ఫైర్ స్టేషన్, రెండు అధునాతన సీఎఫ్‌టీలు, హై ఇంటెన్సిటీ రన్‌వే లైట్స్, ఒకేసారి 50 వాహనాలకు పార్కింగ్ సదుపాయం పాక్యాంగ్ విమానాశ్రయం ప్రత్యేకత. విమానాశ్రయ రీ-ఇన్ ఫోర్స్ మెంట్ వాల్ ఎత్తు 80 మీ. ప్రపంచంలో ఇది అత్యంత ఎత్తైన విమానాశ్రయ గోడ కావడం విశేషం. చైనా సరిహద్దుకు ఈ విమానాశ్రయం 60 కిలో మీటర్లలో ఉండటం కూడా మరో విశేషం. ఈ ఎయిర్‌పోర్ట్ ప్రారంభంతో సిక్కిం రాష్ట్రానికి ఇతర ప్రాంతాలతో అనుసంధానం పెరగడమే కాకుండా పర్యాటక రంగం అభివృద్ధి చెందే అవకాశం ఎక్కువ ఉంది.

ఈ విమానాశ్రయాన్ని ప్రధానితో పాటు సిక్కిం ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్, విమానయాన శాఖ సురేశ్ ప్రభులు ప్రారంభించారు. సిక్కిం ప్రజలకు విమానాశ్రయం ఒక కల అని, దాన్ని నెరవేర్చామని మోదీ పేర్కొన్నారు. వచ్చే పదేళ్లలో దేశంలో మరో వంద విమానాశ్రయాలు నిర్మిస్తామబరా సురేశ్ ప్రభు పేర్కొన్నారు.