అమెజాన్‌కు టోకరా..  12 లక్షలు స్వాహా - MicTv.in - Telugu News
mictv telugu

అమెజాన్‌కు టోకరా..  12 లక్షలు స్వాహా

December 5, 2017

స్మార్ట్‌గా దోచుకోవడానికి ఇద్దరు కిలాడీలు అమెజాన్‌ను టార్గెట్ చేశారు. ఆన్‌లైన్‌లో ఆర్డర్లు చేసిన వస్తువులకు బదులు గడ్డీగరకా వచ్చిందని చెప్పి తిరిగి అమెజాన్ నుంచి రూ. 12 లక్షల డబ్బు దోచుకున్నారు. ఏదైనా ఎక్కువ రోజులు దాగదు కదా.

హైదరాబాద్‌కు చెందిన శామ్సన్  గుణశేఖర్, జాన్ అరుల్ అమెజాన్ సంస్థలో మాజీ ఉద్యోగులు. పైగా వారిద్దరు చిన్ననాటి స్నేహితులు కూడా. 2014 లో గుణశేఖర్ అమెజాన్‌లో కష్టమర్ సపోర్ట్ అసోసియేట్‌గా ఉద్యోగం చేశాడు. అతని వైఖరి నచ్చక అమెజాన్ అతణ్ణి ఉద్యోగంలోంచి తొలగించింది. ఉన్న పళంగా జాన్ అరుల్ కూడా తన ఉద్యోగానికి స్వస్తి చెప్పాడు. ఇద్దరూ కూడబలుక్కున్నారు. స్మార్ట్‌గా బురిడీ కొట్టి బతికేద్దమనుకున్నారు. తిన్నింటి వాసాలు లెక్కబెడదామనుకున్నారు.

ఈ క్రమంలో 2016 అక్టోబర్‌లో జాన్‌ అరుల్‌ జాన్‌ క్రిస్‌గా అమెజాన్‌.ఇన్‌లో నకిలీ యూజర్‌ ఐడీ సృష్టించి యాపిల్‌ ఐఫోన్‌ 5ఎస్‌కు ఆర్డర్‌ ఇచ్చాడు. అలాగే 2017 మేలో మరో కస్టమర్‌ అకౌంట్‌తో జాన్‌ అరుల్‌ లెనోవా ల్యాప్‌టాప్‌ ఆర్డర్‌ ఇచ్చాడు. ఈ ఏడాది ఏప్రిల్‌ 7న గుణేశేఖర్‌ తన సోదరుడి పేరుతో యూజర్‌ ఐడీ క్రియేట్‌ చేసి శాంసంగ్‌ గెలాక్సీ జే7 ప్రైమ్‌ ఆర్డర్‌ ఇచ్చాడు.

అయితే ఆ సెల్‌ఫోన్‌ సహా వాళ్ళు ఆర్డర్ చేసిన వస్తువులన్నీ చేతికందాయి. కానీ ఇక్కడే వారు గేమ్ ప్లే చేశారు. వాటి  స్థానంలో తెల్ల పేపర్లు, చెత్త, రాళ్ళూ రప్పలు  వచ్చాయంటూ  మళ్లీ ఆయా వస్తువులు పంపాలంటూ మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేసి అందుకున్నారు. కొన్ని సందర్భాల్లో వచ్చిన వస్తువు ధ్వంసమైందంటూ డబ్బులు రీఫండ్‌ చేయించుకున్నారు. ఇలా అమెజాన్‌కు దాదాపు రూ.12 లక్షలకు పైగా నష్టం కలిగించారు.

ఇలా గుణశేఖర్‌ ఐదు అర్డర్లు ఇచ్చి మూడు రీప్లేస్‌మెంట్, ఒక రీఫండ్‌ అమౌంట్, జాన్‌ అరుల్‌ పది ఆర్డర్‌లు ఇచ్చి ఎనిమిది రీప్లేస్‌మెంట్‌లు, ఒక రీఫండ్‌ అమౌంట్‌ పొందారు.

ఎంచక్కా ఈ ప్రొడక్ట్‌లను ఓలెక్స్‌ వెబ్‌సైట్‌లో 20 నుంచి 30 శాతం తక్కువ ధరకు విక్రయిస్తున్నట్టుగా ట్రాన్సాక్షన్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ టీమ్‌ దర్యాప్తులో తేలింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌రెడ్డి, ఎస్‌ఐ కె.శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టి.. పోన్ నంబరు, ఐపీ నంబర్ల ఆధారంగా నిందితులను అరెస్టుచేశారు.