గురక ఓ రకమైన వ్యాధి. గురకపెట్టి గుర్రుకొట్టేవారికి ఏ ఇబ్బందీ ఉండదుగాని, పక్కన నిద్రపోయేవారికి నరకమే. వాళ్లకు జగారం తప్పదు. దీంతో కోపతాపాలు పెరిగిపోతాయి. విడాకుల దాకా వెళ్తారు. అయితే ఇది ఇంట్లో సమస్యే కాదు, బయట కూడా సమస్యే. ఓ రైలు ప్రయాణికుడి గురకతో తమకు నిద్రపట్టడం లేదంటూ ప్రయాణికులు అతణ్ని రాత్రంతా కూర్చోబెట్టారు. ఈ ఘటన లోకమాన్య తిలక్ – దర్భంగాల మధ్య నడిచే పవన్ ఎక్స్ప్రెస్ రైలు త్రీటైర్ ఏసీ బోగీలో జరిగింది.
రామచంద్ర అనే ప్రయాణికుడు గురక పెడుతుంటే, పక్కనున్నవారు అతన్ని నిద్రలేపారు. అతని గురక వల్ల తోటి ప్రయాణికులదంరూ బాధపడుతున్నారని చెప్పారు. ‘నేనేం చేసేది? నిద్రపోతే గురక వస్తుంది.. నా తప్పేం లేదు’ అని రామచంద్ర చెప్పాడు. అయితే నిద్రపోవద్దు అని వారు అన్నారు. దీంతో అతనికి, వారికీ గొడవ జరిగింది.
చివరకు రామచంద్రను నిద్రపోనివ్వకకుండా కొన్ని గంటలపాటు ఆపితే మిగతా వారంతా హాయిగా నిద్రపోవచ్చని తేల్చారు. మొదట్లో ఆగ్రహం వ్యక్తం చేసిన రామచంద్ర తర్వాత దారికొచ్చాడు. కొన్నిగంటలు మాత్రమే కాకుండా మొత్తం రాత్రంతా మేలుకునే ఉండిపోయాడు. దీంతో అందరూ అతణ్ని పొగిడారు. తెల్లారేసరికి అతనితో కలిసి కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. ఈ విషయాన్ని రైల్లో టీటీఈ గణేశ్ విర్హా తెలిపారు.