మనదేశ రైతు పరిస్థితికి అద్దం పట్టే బిల్లు ఇది. బడా బడా కార్పొరేట్ కంపెనీలు, వ్యాపారవేత్తల కోసం లక్షల ఎకరాల భూములు, గనులు, బ్యాంకు రుణాలు, సబ్సిడీలు కల్పించే మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మాత్రం నడిరోడ్డుకు ఈడుస్తున్నాయి. రుణాలు కట్టలేని రైతుల భూములు జప్తు చేసే బ్యాంకులు బడా బాబులు రుణాలు ఎగొట్టి విదేశాలకు పారిపోతే మాత్రం ఏమీ చేయలేకపోతున్నాయి. రైతు రెక్కలు ముక్కలు చేసుకుని రేయింబళ్లు కష్టపడి పండించుకున్న పంటకు కనీస మద్దతు ధర కూడా కల్పించడం లేదు ఘనత వహించిన ప్రభుత్వాలు.
రైతు పండించిన పంటను తీసుకొని మార్కెట్కు వస్తే పంట మీద వచ్చే లాభం కంటే ఖర్చులే ఎక్కువవుతున్నాయి. ఇటీవల నవంబర్ 16న మహారాష్ట్రలోని షోలాపూర్ మార్కెట్ యార్డ్లో ఒక రైతుకు ఎదురైన చేదు సంఘటనే ఇందుకు ఉదాహరణ…
రైతు తీసుకొచ్చిన ఉల్లిగడ్డల బరువు- 1,892 కిలోలు
రైతుకు వచ్చిన డబ్బు – 1,681 రూపాయలు
అంటే.. ఒకకిలో ఉల్లి ధర రూపాయి కంటే తక్కువ పలికింది.
ఖర్చుల విషయానికి వస్తే..
హమాలీ ఖర్చు – 235.77 రూపాయలు
రవాణా ఖర్చు – 1994 రూపాయలు
మొత్తం ఖర్చు – 2,229.77
ఆ రైతు తీసుకొచ్చిన ఉల్లికి 1,681 రూపాయలు వచ్చాయి. పొలం నుంచి ఉల్లిని తీసుకొచ్చి, అమ్మడానికి 2229.77 రూపాయల ఖర్చయింది. ఆ రైతే తన జేబులోంచి 548 రూపాయలు మార్కెట్ యార్డుకు చెల్లించి అక్కడి నుంచి గుండెనిండా బాధతో నిష్క్రమించాడు.