ఏపీ, తెలంగాణలో  ఈరోజు థియేటర్లు బంద్... - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ, తెలంగాణలో  ఈరోజు థియేటర్లు బంద్…

March 2, 2018

తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 2 వేలకు పైగా  సినిమా థియేటర్లన్నీ మూతబడ్డాయి. డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు భారంగా మారిన వర్చువల్‌ ప్రింట్‌ ఫీజు (వీపీఎఫ్‌) తగ్గించడానికి క్యూబ్ ,ఇతర సంస్థలు అంగీకరించలేదు ‌ . ఈ విషయమై జరిగిన చర్చలు విఫలం కావటంతో  నిరసన తెలుపుతూ.. మార్చి 2 నుంచి థియేటర్లను మూసివేయాలని దక్షిణాది రాష్ట్రాల సినిమా నిర్మాతల మండలి జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (జేఏసీ) నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ రోజు హైదరాబాద్‌లోని అన్ని సినిమా థియేటర్లను మూసివేశారు.అంతేకాక ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లోగల 25 థియేటర్లు, నిజామాబాద్ జిల్లాలోగల 15 థియేటర్లు, ఓ మల్టీప్లెక్స్, కరీంనగర్ జిల్లా కేంద్రంలోగల 8 థియేటర్లు, ఉమ్మడి నల్గొండ జిల్లాలోగల 36 థియేటర్లు కూడా మూసివేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి సినిమా థియేటర్లన్నీ కూడా మూతపడ్డాయి. బందుకు సంబంధించి థియేటర్ల ముందు  ప్రేక్షకులకు విజ్ఞప్తుల బోర్డులు పెట్టారు. దీంతో చాలా మంది సినిమాలు చూడటానికి వచ్చేవారు వెనుతిరిగి వెళ్లవలసిన పరిస్థితి ఎదురైంది.