శ్రీదేవికి, రాజశేఖర్‌కు పెళ్లి చేద్దామనుకున్నారు.. కానీ..    - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీదేవికి, రాజశేఖర్‌కు పెళ్లి చేద్దామనుకున్నారు.. కానీ..   

February 26, 2018

నటి శ్రీదేవి మృతిపై చాలా మంది ప్రముఖులు వారికి శ్రీదేవితో వున్నఅనుబంధాన్ని ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా హీరో డాక్టర్ రాజశేఖర్ కూడా శ్రీదేవితో తన అనుబంధాన్ని పంచుకున్నారు. ‘ శ్రీదేవి తండ్రి అయ్యప్పన్, మా నాన్న మంచి స్నేహితులు. వాళ్ళ నాన్న పోలీస్ ఆఫీసర్‌గా, మానాన్న అడ్వొకేట్‌గా ఒకేచోట చాలా కాలం కలిసి పని చేశారు. శ్రీదేవి కుటుంబం మాకు దూరపు బంధువులు అవుతారు. శ్రీదేవి అమ్మగారికి నేనంటే చాలా ఇష్టం. అప్పట్లోనే శ్రీదేవిని పెళ్లి చేసుకోమని వాళ్ళింటి నుండి నాకు ప్రపోజల్ వచ్చింది.

అయితే శ్రీదేవి అప్పటికే సినిమాల్లో నటిస్తుండటంతో మా అమ్మ వద్దని చెప్పింది. నాకు పై చదువులు చదువుకోవాలని చెప్పి ఇప్పుడే పెళ్లి వద్దని చెప్పాను. సినిమావాళ్లను పెళ్లి చేసుకోవడం మా ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదు. అందుకే శ్రీదేవితోపాటు ఆమె సోదరి శ్రీలత సంబంధాన్ని కూడా మా కుటుంబం రిజెక్ట్ చేసింది ’ అని గుర్తు చేసుకున్నారు రాజశేఖర్. మరి జీవిత సినిమా నటియే కదా ఆమెను ఎలా వివాహం చేసుకున్నారు ? అన్న ప్రశ్నకు స్పందిస్తూ. ‘ కొంతకాలం తర్వాత నేను సినిమాల్లోకి రావడం, నేనూ సినిమావాడిగా మారాకే జీవితను పెళ్ళి చేసుకున్నాను ’ అని తెలిపారు. ‘ అంకుశం ’ సినిమా షూటింగ్ దశలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించి పెళ్ళి చేసుకున్నారు.