పదహారేళ్ల సిరిమల్లెపువ్వుకు...అప్పుడే నూరేళ్లు నిండాయా? - MicTv.in - Telugu News
mictv telugu

పదహారేళ్ల సిరిమల్లెపువ్వుకు…అప్పుడే నూరేళ్లు నిండాయా?

February 25, 2018

‘సిరిమల్లే పువ్వా సిరిమల్లె పువ్వా’ అంటూ మనల్ని అలరించిన శ్రీదేవికి అప్పుడే నూరేళ్లు నిండిపోయాయా?అని ఆమె అభిమానులు కంటతడి పెడుతున్నారు. ఇప్పటికీ కూడా తమ అభిమాన హీరోయిన్ చనిపోయిందంటే ఎవరూ నమ్మలేకపోతున్నారు. బాలనటిగా తన కెరియర్‌ని మొదలు పెట్టి వివిధ భాషల్లో ఎన్నో సినిమాలు చేసి, ఎందరికో ఆరాధ్య దేవతగా నిలిచింది శ్రీదేవి. శ్రీదేవి ముక్కుపుల్ల అంటే కొన్ని ఊర్లల్లో ఇప్పటికే ఫేమస్సే. యేళ్లు గడచినా ఎందరో హీరోయిన్లు వచ్చినా శ్రీదేవి స్థానం శ్రీదేవిదే.

ఆమె ఎప్పటికీ అతిలోక సుందరే. జామురాతిరి జామిలమ్మ జోలపాడనా ఇలా అంటూ ఆమె క్షణం క్షణం సినిమాలో హీరో చేత జోల పాడించుకుంటే ఇప్పుడు శాశ్వతంగా జోల పాడించుకుని ఇలా హఠాత్తుగా అందరికీ దూరమై పోయింది. ఇటు తెలుగు ఇండస్ట్రీయే కాదు, అటు హిందీ తమిళ్ ఇంకా ఆమెతో సాన్నిహిత్యం ఉన్న అన్ని ఇండస్ట్రీలు ఈరోజు మూకుమ్మడిగా కంటతడి పెడుతున్నాయి. ఆమె ప్రస్థానం అలాంటింది. ఏ పాత్రలో అయినా సరే ఒదిగిపోయి తన నటనతో అందరినీ ఆకట్టుకునేది. జగదేకవీరుడు అతిలోక సుందరిలో దేవకన్యగా వచ్చి అందరిచేత తింగరబుచ్చి అనిపించుకుని తన ముద్దు ముద్దు మాటలతో  ప్రేక్షకులను మళ్లీ మళ్లీ  సినిమాహాళ్లలోకి రప్పించింది ఆమె నటన. కుటుంబ కారణాలవల్ల కొన్ని సంవత్సరాలు నటనకు దూరమైనా మళ్లీ ఇంగ్లీష్ వింగ్లీష్ అంటూ అభిమానులకు చేరువైంది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.