దుబాయ్ వెళ్లేముందు శ్రీదేవికి తీవ్ర జ్వరం - MicTv.in - Telugu News
mictv telugu

దుబాయ్ వెళ్లేముందు శ్రీదేవికి తీవ్ర జ్వరం

February 28, 2018

బంధువు పెళ్ళికి దుబాయ్ వెళ్ళిన నటి శ్రీదేవి అక్కడ ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో పడి చనిపోయింది. ఎట్టకేలకు దుబాయ్ ప్రాసిక్యూషన్ విచారణ ముగించుకొన్న తర్వాత శ్రీదేవి మృతదేహం మంగళవారం రాత్రి ముంబై చేరుకుంది. శ్రీదేవిని చూడటానికి వచ్చిన ఆమె చిన్ననాటి స్నేహితురాలు పింకీరెడ్డి దుబాయ్‌కి వెళ్ళకుముందు శ్రీదేవికి జ్వరం వచ్చిందని తెలిపింది. పింకీరెడ్డి టి. సుబ్బరామిరెడ్డి కుమార్తె. కడసారిగా తన స్నేహితురాలిని చూసేందుకు వచ్చిన పింకీ రెడ్డి మీడియాతో మాట్లాడారు.‘శ్రీదేవి దుబాయ్‌కు వెళ్ళకముందు నాకు ఫోన్ చేసి మాట్లాడింది. జ్వరంతో బాధపడుతున్నట్టు చెప్పింది. యాంటిబయాటిక్స్ మందులు వాడుతున్నానంది. ఇంత జ్వరంలో దుబాయ్ వెళ్లడం అవసరమా అన్నాన్నేను. కానీ తప్పకుండా వెళ్ళాల్సిందేనని వెళ్లింది. ఆఖరికి మమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది. నా ఆత్మీయురాలిని కోల్పోయాను. శ్రీదేవి మరణం ఓవైపు కృంగదీస్తుంటే మరోవైపు మీడియాలో శ్రీదేవి మీద వస్తున్న తప్పుడు కథనాలు చూస్తుంటే మరింత బాధ కలుగుతోంది.

లైపోసక్షన్‌ చేయించుకుందని, సర్జరీలు చేయించుకుందని ఏవేవో రాసేస్తున్నారు. కానీ ఆమె చేసిన మంచి సినిమాల గురించి ఎందుకు మాట్లాడరు ? శ్రీదేవి, బోని మధ్య కలహాలు జరుగుతున్నాయంటున్నారు. వాళ్ళమధ్య అటాంటివేం లేవు. దేశం గర్వించదగ్గ నటి శ్రీదేవి. అలాంటి గొప్ప నటి మీద ఇలాంటి తప్పుడు కథనాలు ప్రసారం చేయటం చాలా బాధ కలిగిస్తోంది ’ అని కంటతడి పెట్టుకుంది పింకీరెడ్డి.