తెలంగాణ, ఏపీలకు కాంగ్రెస్  కూడా తెడ్డు చూపింది.... - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ, ఏపీలకు కాంగ్రెస్  కూడా తెడ్డు చూపింది….

February 17, 2018

ప్రధాన జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లకు దక్షణాది రాష్టాలంటే మరీ చులకనైపోయింది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలు వాటి కళ్లకు ఏమాత్రం ఆనడం లేదు. బీజేపీ తమ గెలుపుకు అవకాశమున్న కర్ణాటకకు తప్ప మిగతా రాష్ట్రాలకు శఠగోపం పెట్టింది.

తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపులు అందుకు ఉదాహరణ. ఈ వివక్ష ఇప్పటిది కాదు. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళల్లో తమకు అధికారం ఇప్పట్లో దక్కదని భావించిన కమలనాథులు ఆ రాష్ట్రాల్లోని తమ నేతలకు ఏ మాత్రం ప్రధాన్యం ఇవ్వడం లేదు. బండారు దత్తాత్రేయను కేంద్ర కేబినెట్ నుంచి తప్పించడం ఇటీవలి ఉదాహరణ.

విషయం ఏమిటంటే..  ఈ విషయంలో కాంగ్రెస్..  బీజేపీ తలదన్నిందని చెప్పడం. ఏపీలో అడ్రస్ లేకుండా పోయి, తెలంగాణలో ఉనికి సాగిస్తున్న హస్తం రెండు రాష్ట్రాల్లోని తమ నేతలకు గట్టి షాకిచ్చింది. కేంద్ర వర్కింగ్ కమిటీ ( సీడబ్ల్యూసీ ) స్థానంలో ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీలో ఈ రెండు రాష్ట్రాల నుంచి ఒక్కరికి  కూడా చోటు దక్కలేదు.. మొత్తం 34 మందిలో ఒక్క తెలుగు వ్యక్తి కూడా లేకుండా 133 ఏళ్ల పార్టీ ఈ ఘనమైన  కమిటీని కూర్చింది.

సమీప భవిష్యత్తులో తెలుంగాణ, ఏపీల్లో తాము అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదనే అధినేత రాహుల్ గాంధీ స్టీరంగ్ కమిటీలో తెలుగోళ్లకు చోటు కల్పించలేదని సృష్టం అవుతోంది. త్వరలో ఎన్నికలు జరగనున్న కర్ణాటక నుంచి ఈ కమిటీలోని మల్లికార్జున ఖర్గే, ఆస్కార్ ఫెర్నాండెజ్, బీకే జోషి, తదితరులకు  చోటు కల్పించారు. తమిళనాడు నుంచి చిదంబరం ఎలాగూ వచ్చేశారు. అక్కడిని నుంచి మరోనేత చెల్లకుమార్‌కు చోటు దిక్కింది. కేరళ నుంచి కేసీ.వేణుగోపాల్, పీసీ చాకోలను తీసుకున్నారు. మొత్తం మంది సింహభాగం ఉత్తరాది వారే. దక్షిణాదిపై అధికార బీజేపీ కాకుండా విపక్షం కూడా ఇలా వివక్ష చూపడం  రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

గెలిచే అవకాశాలు లేనంత మాత్రాన రెండు తెలుగు రాష్ట్రాలకు కీలకమైన స్టీరింగ్ కమిటీలో ఉత్తిచేయి చూపడం వల్ల  పార్టీ భవిష్యత్తులో అక్కడ పూర్తిగా అదృశ్యమైపోతుందని అంటున్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా పార్టీ కోసం పని చేసిన నేతలను ఇది ఘోరంగా అవమానించడమేనంటున్నారు..! కానీ ఎన్నికల్లో గెలవడానికి సర్వశక్తులూ తోడుండి పోరాడ్డంతో బిజీగా ఉంటూ, లాభనష్టాలను బేరీజు వేసుకున్న హస్తం ఇది గుర్తిస్తుందా ?