ఆయన జీవితమే స్ఫూర్తి! - MicTv.in - Telugu News
mictv telugu

ఆయన జీవితమే స్ఫూర్తి!

March 15, 2018

మనకు ఓ నిమిషం పాటు కాళ్లు, చేతులకు తిమ్మిరి వస్తేనే తట్టుకోలేం.. అలాంటిది అతను 50 ఏళ్లుగా చక్రాల కుర్చీకే పరిమితమయ్యాడు. కనీసం కాళ్లు చేతులు కాదు కదా.. మాట్లాడడానికి మాట కూడా రాని పరిస్థితి. అలాంటి స్థితిలో ఉండి కూడా ప్రపంచం గర్వించదగ్గ అద్భుతాల ఎన్నో సృష్టించాడు. కదలలేని స్థితిలో ఉన్నా ఖగోళ రహస్యాలను కనుగొన్నాడు. అందుకే ప్రపంచం మెచ్చిన మేధావి అయ్యాడు. ప్రస్తుతం ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా భౌతిక శాస్త్రం ఉన్నంత వరకు, కృషి, పట్టుదల, ఆత్మస్థైర్యం అనే మాటలు ఉన్నంత వరకు  ఆయన వాటిలో బతికే ఉంటారు.

స్టీఫెన్ జననం

స్టీఫెన్ హాకింగ్ రెండో ప్రపంచ యుద్ద సమయంలో పుట్టాడు. 1942 జనవరి8 ఇంగ్లండ్‌లోని ఆక్స్‌ఫర్డ్ నగరంలో జన్మించాడు. తండ్రి కూడా శాస్త్రవేత్తే. ఆయన జీవశాస్త్రంలో అనేన పరిశోధనలు చేశాడు. స్టీఫెన్ పుట్టినప్పుడు అతని తండ్రి కూడా బహుశా ఊహించి ఉండకపోవచ్చు తన కొడుకు భవిష్యత్తులో అద్భుతాలు సృష్టిస్తాడని.

చదువు

స్టీఫెన్ చదువు విషయానికి వస్తే చిన్న తనంలో సాధారణ విద్యార్థే. అతనికి ఎనిమిదేళ్లు వచ్చే వరకు  చదువు కూడా సరిగా అబ్బలేదు. పరీక్షల్లో ఫెయిల్ అయ్యేవాడు. అలా అలా తన చదువును కొనసాగించి చివరకు తనకు వచ్చిన అంతంత మార్కులతోనే  స్టీఫెన్ తన 17 వ యేట ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష రాసి ఉత్తీర్ణుడయ్యాడు. అప్పుడే ఫిజిక్స్ చదవడానికి స్కాలర్‌షిప్ కూడా సంపాదించాడు., ఆ తర్వాత కేంబ్రిడ్జ్‌లో పీహెచ్‌డీ చేశాడు.

చిన్నతనం నుంచే ప్రయోగాలు…

స్టీఫెన్ హాకింగ్  తన చిన్నతనం నుండే అతని ఇంట్లో పాడైన గడియారాలను, రేడియోలను విప్పి ప్రయోగాలు చేసేవాడు. అతని ప్రయోగాలు చూసిన స్నేహితులు అతన్ని  ఐన్‌స్టీన్ అనే ముద్దుపేరుతో పిలిచే వారు. అలా చిన్న చిన్న ప్రయోగాలతో మొదలైన స్టీఫెన్ ప్రయోగాలు చివరికి విశ్వ ఆవిర్భావం ఎందుకు ఏర్పడింది, ఎలా ఏర్పడింది అనే దిశగా పయనించాయి.

రెండేళ్లకు మించి బతకవు అని డాక్టర్లు చెప్పినా……

స్టీఫెన్ హాకింగ్‌కు 21 ఏళ్ల వయసున్నప్పుడే అతని శరీరంలో వచ్చే మార్పులు గమనించాడు. రెండు మూడు సార్లు  అనారోగ్యానికి లోనయ్యాడు. చివరికి మోటార్ న్యూరాన్ వ్యాధి వచ్చింది అని డాక్టర్లు నిర్థారించారు. ఈ వ్యాధి వల్ల శరీర భాగాలు ఒక్కొక్కటి దెబ్బతింటాయి. నువ్వు 2,3 ఏళ్ల కంటే ఎక్కువ బతకవు అని డాక్టర్లు తేల్చి చెప్పారు. అయినా కూడా హాకింగ్ ఏం అధైర్య పడలేదు. మార్పును స్వీకరించగలిగే వాడే అసలైన తెలివి పరుడు అని గ్రహించాడు. శరీరంలో అవయవాలు చచ్చుబడిపోతున్నా, చివరకు మాట కూడా పడిపోయినా కూడా స్టీఫెన్ సంకల్పం ముందు అవి అన్ని లెక్కకు రాలేదు.

ఇద్దరు భార్యలు వదిలేసి వెళ్లినా… 

తనకు నయం కాని వ్యాధి ఉన్నది అని తెలిసిన రోజుల్లోనే జేన్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. తనకు కాబోయే భర్త  మూడేళ్ల కంటే ఎక్కో బ్రతకడు అని తెలిసినా కూడా ఆమె స్టీఫెన్‌ని పెళ్ల చేసుకోవడానికి సిద్ధపడింది. చాలా సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత జేన్ స్టీఫెన్ వ్యాధి తీవ్రతను చూసి జేన్ అతన్ని వదిలి వెళ్లి పోయింది. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. తన పరిస్థితి చూసి భార్య వెళ్లిపోయినా కూడా స్టీఫెన్ అధైర్య పడలేదు. కదలలేని స్థితిలో ఉన్నా ఎన్నో ప్రయోగాలు చేశాడు. ఆ తర్వాత 1995లో  తనకు సుదీర్ఘకాలం నర్సుగా పనిచేసి నర్సు మేసన్‌ను ఆమె ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకున్నాడు. 11 సంవత్సరాలు అతనికి తోడుగా ఉన్న ఆమె కూడా 2006లో అతన్ని వదిలి వెళ్లిపోయింది. ఆ తర్వాత అతను ఒక్కటే నిర్ధారించుకున్నారు. జీవితంపై ఏ దశలోనైనా ఆశ వదులుకోకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు.భౌతిక శాస్త్రం,విశ్వ ఆవిర్భావం, గురుత్వాకర్షణ సిద్ధాంతాలు, కృష్ణ బిలాలపై అనేక పరిశోధకులు చేసి అద్భుత విజయాలు సాధించాడు. ఆయనపై ‘థియరీ ఆప్ ఎవ్రీథింగ్’ అనే సినిమా కూడా వచ్చింది. బీబీసీ సహా పలు సంస్థలు స్టీఫెన్‌పై ఎన్నో డ్యాంకుమెంటరీలు తీశారు. స్టీపెన్ తన వైకల్యానికి ఏనాడూ బాధ పడలేదు. తన చివరి శ్వాస వరకూ కూడా మానవాళి శ్రేయస్సు కోసమే తపన పడ్డాడు. అంతే కాదు ఒక మనిషి తన ప్రాణం విడిచే లోపు  తనకున్న మేధాశక్తిని పూర్తిగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పారు.

వైకల్యం అనేది మీ శరీరానికే తప్ప మీ మనసుకు కాదు అనే గొప్ప విషయాన్ని ఎప్పుడూ స్టీఫెన్ గుర్తు చేస్తుండేవాడు. నిజంగా అతని జీవితం, అతడు సాధించిన విజయాలు మనందరిలో స్పూర్తి నింపాలి.

ప్రపంచం గర్వించదగ్గ మహా మేధావికి సలాం…