నేను ఈ సదువులు సదవలేను..పోతున్నా - MicTv.in - Telugu News
mictv telugu

నేను ఈ సదువులు సదవలేను..పోతున్నా

November 20, 2017

జీవితాలను నిలబెట్టాల్సిన సదువు, పిల్లల సావుకు కారణమైతుంది. తల్లిదండ్రుల ఆశయాలను పిల్లలు పూర్తి చెయ్యలేక మధ్యలోనే ప్రాణం తీసుకుంటున్నారు. తల్లిదండ్రులను బలహీనతలను డబ్బు రూపంలోకి మార్చుకుంటున్నాయి విద్యాసంస్థలు. పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వాలు తమకేమి పట్టనట్టు రెండు చేతులెత్తేశాయి.

ఈ రెండు నెలల కాలంలో వివిధ విధ్యా సంస్థల్లో చదువుతున్న విధ్యార్థులు 60 మందికి పైగా తమ ప్రాణాలను తీసుకున్నారు. ఈక్రమంలోనే మరో విద్యార్థి సూసైడ్ నోట్ రాసి ఓ ప్రైవేట్ విద్యాసంస్థకు చెందిన హాస్టల్ నుండి పారిపోయాడు. నిజామాబాద్ సాయినగర్‌కు  చెందిన చింతల సాయిగణేశ్ (17) ఓ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్నాడు.

ఆదివారం హాస్టల్ నుండి వెళ్లిన సాయి తిరిగి రాలేదని, హాస్టల్ నిర్వాహకులు అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. బంధువుల, స్నేహితులు కూడా తమ వద్దకు రాలేదని చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సాయి రూం సోదా చేయగా ఓ సూసైడ్ నోట్ లభించింది.

‘అందరి దృష్టిలో చెడ్డపేరు తెచ్చుకున్నాను, వాళ్ల మనసులో ఒక పిరికివాడిలా మిగిలిపోయాను, అమ్మా, నాన్నా.. నా వల్ల మీ అందరికీ నష్టం జరుగుతోంది. ఇకపై మీకు ఏ సమస్యా ఉండదు. నేను బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. ఐ మిస్‌ యూ.. అండ్‌ ఐ లవ్‌ యూ. మామ్‌ అండ్‌ డాడ్‌’ అని రాసి ఉంది. హాస్టల్‌ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే మా కొడుకు ఎటో వెళ్లిపోయి ఉంటాడని సాయి తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సాయికోసం గాలిస్తున్నారు.