మూత్రం పోస్తుండగా ఫొటో తీశారని రైతు ఆత్మహత్య - MicTv.in - Telugu News
mictv telugu

మూత్రం పోస్తుండగా ఫొటో తీశారని రైతు ఆత్మహత్య

March 5, 2018

స్వచ్ఛభారత్ వెర్రితలలు వేస్తోంది. నిండు ప్రాణాలను బలిగొంటోంది. కనీస సదుపాయాల కల్పనలో విఫలమవుతున్న ప్రభుత్వాలు పటాటోపంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ భారత్ అనుకున్న ఫలితాలు ఇవ్వకపోగా విమర్శల పాలవుతోంది. బహిరంగ ప్రదేశంలో మూత్ర విసర్జన చేస్తుండగా తన ఫోటోను తీశారని ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.  ఉత్తరప్రదేశ్‌లో కాన్పూర్‌‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. చతురీఖేడ్ గ్రామంలో ఖుషీలాల్( 40 ) అనే రైతు బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.గ్రామంలో బహిరంగ మూత్ర విసర్జన చేస్తున్నవారిని అధికారులు ఫొటోలు తీసి టాంటాం చేశారు. ఖుషీలాల్  ను కూడా ఫోటో తీశారు.  ‘ఫోటో తీసిన అధికారులు గమ్మున ఉండరు.  నిన్ను జైల్లో పెడతారు ’ అని అతని స్నేహితులు ఆట పట్టించారు. దీంతో తనెక్కడ పోలీస్ స్టేషన్‌కు వెళ్ళాల్సి వస్తుందోనని,  తనకు అది తీరని అవమానమనుకున్నాడు ఖుషీలాల్. ఆ మనస్తాపంతో  బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.