హిందీ అర్థం కావడం లేదని ఆత్మహత్య - MicTv.in - Telugu News
mictv telugu

హిందీ అర్థం కావడం లేదని ఆత్మహత్య

March 2, 2018

అంతవరకు తమిళంలో చదువుకున్న ఓ విద్యార్థి హిందీ మీడియంలో జాయినయ్యాడు. హిందీలో టీచర్లు చెప్పే పాఠాలు అర్థం కావటం లేదని అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చండీగఢ్‌లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలోని రామేశ్వరానికి చెందిన డా. కృష్ణ ప్రసాద్ చండీగఢ్‌లోని మెడికల్ కళాశాలలో పీజీ చదువుతున్నాడు. అయితే అక్కడ హిందీలో చెబుతున్న సెలబస్ తనకు అర్థం కావటం లేదని, వేరే కాలేజీలో జాయిన్ అవుతానని కుటుంబ సభ్యులకు తరచూ చెప్తుండేవాడు.  కన్నతల్లి కూడా కొడుకు ఆవేదనని అర్థం చేసుకోలేదు. ‘ కొన్నాళ్ళు ఆగితే అన్నీ అర్థమవుతాయి.. మంచి మెరిట్ సీట్ ఊరికే వదులకోకు.. ’ అని సర్థిచెప్పింది.  అతనికి మాత్రం కాలేజీలో ఎవరు మాట్లాడింది కూడా అర్థం కావటం లేదని చెప్పేవాడు. హిందీ రాని కారణంగా తనకు స్నేహితులు కూడా లేరని చెప్పుకొని బాధపడ్డాడు. ఓవైపు తల్లిదండ్రలు తనను అర్థం చేసుకోవటం లేదనే బాధ కూడా ఎక్కువైంది అతనిలో. ఈ నేపథ్యంలో కృష్ణప్రసాద్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు.సోమవారం ఎవరూ లేని సమయంలో హాస్టల్‌ గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి రామస్వామి మాట్లాడుతూ…‘  కొంత కాలంగా మా కొడుకు పదేపదే తనకు హిందీ భాష చాలా ఇబ్బందిగా వుందని చెప్తున్నా.. మేము వాడి ఆవేదనను అర్థం చేసుకోలేకపోయాం. చిన్నవాడేం కాదు కొన్ని రోజులు పోతే వాడే అలవాటు పడతాడు అనుకున్నాం. కానీ ఇలా చేసుకుంటాడని అస్సలు ఊహించలేకపోయాం ’ అని కన్నీళ్ళ పర్యంతమయ్యారు. చేతికొచ్చిన కొడుకు పోవటంతో విలపిస్తున్న ఆ తల్లిదండ్రుల వేదన చూసినవారంతా కంటతడి పెట్టుకుంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.