కన్న కూతుళ్ళ నుంచి తనకు ప్రాణహాని వుందని ఓ తండ్రి పెళ్ళి చేసుకున్నాడు. ఇది అతనికి ఐదవ వివాహం. నిత్య పెళ్లికొడుకును తలపిస్తున్న అతని వయస్సు 80 సంవత్సరాలు. ఈ వయసులో నీకు పెళ్ళేంటయ్యా ? ఏంచక్కా కూతుళ్ళకు పుట్టిన పిల్లలతో సంతోషంగా గడపక అని ఇరుగుపొరుగువారు నిలదీశారట. అప్పుడు ఆ పెద్దాయన నోటినుంచి వచ్చిన ఒకే ఒక్క సమాధానం ‘నా కూతుళ్ళు మంచివాళ్ళు కారు. వాళ్ళకు ఈ తండ్రికన్నా నేను సంపాదించిన ఆస్తులపైనే ఎక్కువ ప్రేమ’ అని సమాధానం చెప్తున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని హపూర్లో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. పెద్దాయన పేరు సుఖ్కా(80). ఇంట్లో ఎవరికీ తెలియకుండా గుట్టుగా నిఖా చేసుకున్నాడు. ఆమె వయసు 30 ఏళ్ళు. పైగా ఆమెకి ఇద్దరు పిల్లలు కూడా వున్నారు.
తండ్రి ఇంతపని చేశాడని తెలియగానే వివాహిత కూతుళ్ళు అతని ఇంటిమీదకు వెళ్లి గొడవకు దిగారు. ఈ సందర్భంగా సుఖ్కా మాట్లాడుతూ ‘నాకు వరుసగా ముగ్గురూ కుమార్తెలే జన్మించారు. మగపిల్లలు లేరు. ముగ్గురి పెళ్లిళ్ళు చేశాను. వాళ్ళు నా ఆస్తిపాస్తులు పంచి ఇవ్వాలని గత కొంత కాలంగా నాతో గొడవలు పెట్టుకుంటున్నారు. నన్ను చంపాలని కూడా చూస్తున్నారు. అందుకే నాకు రక్షణగా ఒక తోడు కావాలని ఈ పెళ్ళి చేసుకున్నాను. కాగా త్రిపుల్ తలాక్, బహుభార్యత్వానికి వ్యతిరేకత ఎదురవుతున్న నేపథ్యంలో సుఖ్కా వివాహం స్థానికంగా సంచలనం రేపుతోంది.