బలవంతపు, మోసపు పెళ్లిళ్లు చెల్లవు.. సుప్రీం - MicTv.in - Telugu News
mictv telugu

బలవంతపు, మోసపు పెళ్లిళ్లు చెల్లవు.. సుప్రీం

April 12, 2018

సమాజంలో వేళ్లూనుకున్న కులమతాల పట్టింపు వల్ల పెద్దలు ఆడపిల్లల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా తమకు నచ్చని వాడికి ఇచ్చి కట్టబెడుతున్నారు. ఇలాంటి బలవంతపు పెళ్లిళ్లు చెల్లవని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. హిందూ వివాహచట్టం ప్రకారం వివాహానికి వధువు అంగీకారం తప్పనిసరి అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. పెళ్లి కూతురు ఇష్టం లేకుండా, లేదా మోసపూరితంగా చేసిన పెళ్లిళ్లు చెల్లవని  ప్రకటించింది. కర్ణాటకకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుని కుమార్తె పెట్టుకున్న రిట్‌ పిటిషన్‌‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా సారథ్యంలోని ధర్మాసనం బుధవారం విచారణ జరిపి, తీర్పు వెలువరించింది.

తనకు ఇష్టంలేని వివాహం చేశారని, కుటుంబం నుంచి రక్షణ కల్పించాలంటూ బాధితురాలు పిటిషన్ వేసింది. పిటిషనర్ తరుఫున లాయర్లు ఇందిరా జైసింగ్, సునీల్ ఫెర్నాండెజ్ వాదనలు వినిపిస్తూ….పెళ్లికి వధువు అంగీకారం  తప్పనిసరి అని హిందూ వివాహ చట్టంలో లేదని, దీనిపై కోర్టు స్పష్టత ఇవ్వాలని కోరారు.

Image result for forced marriage

చీఫ్ జస్టిస్‌ మిశ్రా స్పందిస్తూ…. అమ్మాయి అంగీకారం లేకుండా, మోసపూరితంగా జరిగే పెళ్లి హిందూ వివాహచట్టం ప్రకారం చెల్లుబాటు కాదన్నారు. పెళ్లికి వధువు అంగీకారం తప్పనిసరి అని హిందూ వివాహచట్టం విస్పష్టంగా చెబుతోందని సెక్షన్‌ 5, 11, 12(సి)లను జస్టిస్‌ చంద్రచూడ్‌  ప్రస్తావించారు.

Image result for forced marriage

‘వధువు అంగీకారం లేకుండా జరిగే వివాహం రద్దుకు అర్హమైనదనీ, వంచించి చేసిన పెళ్లినీ అదే విధంగా పరిగణించాల్సి ఉంటుందని చట్టం చెబుతోంది. మళ్లీ చట్టబద్ధంగా చెల్లదని న్యాయస్థానం ప్రకటించాల్సిన అవసరంలేదు’ అని జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ ఖన్విల్కర్‌లు పేర్కొన్నారు. ఇలాంటి బాధిత మహిళలు తగు చర్యల నిమిత్తం సివిల్‌ కోర్టులను ఆశ్రయించాలనీ, న్యాయ ప్రక్రియను అనుసరించి కోర్టులు వివాహ రద్దుపై నిర్ణయం తీసుకుంటాయని సూచించారు. పిటిషనర్‌కు రక్షణ కల్పించాలని పోలీసులను ధర్మాసనం ఆదేశిస్తూ, విచారణను వాయిదా వేసింది.