జడ్జీలమా? చెత్త ఏరుకునేవాళ్లమా? - MicTv.in - Telugu News
mictv telugu

జడ్జీలమా? చెత్త ఏరుకునేవాళ్లమా?

February 6, 2018

వ్యర్థాల నిర్వహణ విషయంలో కేంద్ర ప్రభుత్వం‌పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా  ఘనవ్యర్థాలకు సంబంధించి సర్కారు ఏకంగా 845 పేజీల అఫిడవిట్‌ను తమకు సమర్పించడంపై జడ్జీలు మండిపడ్డారు. అన్నేసి పేజీల నివేదికలో ఎందుకూ పనికిరాని సమాచారం ఉందని, తాము చెత్త ఏరుకునే వాళ్లంగా కనిపిస్తున్నామని అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.  

కేంద్ర ప్రభుత్వం తమ ముందు చెత్త పడేసి చేతులు దులుపుకోవడాన్ని అంగీకరించబోమని, అఫిడవిట్‌ను స్వీకరించే ప్రసక్తే లేదని  కోర్టు తేల్చి చెప్పింది. ‘మీరు మమ్మల్ని ప్రభావితం చేయాలని  ప్రయత్నిస్తున్నారా? మేం  మీ వలలో చిక్కుకోం’ అని జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాతో కూడిన ధర్మాసనం చేసింది.

‘మీ దగ్గరున్న చెత్తంతా ఇక్కడ పడేయడానికి మేం  చెత్త సేకరించేవాళ్లం కాదు.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఘన వ్యర్థాలకు నిర్వహణకు అనుగుణంగా రాష్ట్రస్థాయి సలహా బోర్డులను ఏర్పాటు చేశాయో లేదో మూడు వారాల్లో నివేదికను సమర్పించాలి’ అని కేంద్రాన్నిఆదేశించింది. వ్యర్థాలను సరిగ్గా తొలగించకపోతే, డెంగీ,చికెన్ గున్యా, విషజ్వరాలు సంభవిస్తున్నాయని గతంలో సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.