సర్జికల్ దాడుల అధికారి సంచలన వ్యాఖ్యలు

పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం జరిపిన సర్జికల్ దాడులపై దుమారం కొనసాగుతూనే ఉంది. ఈ దాడులను అతిగా ప్రచారం చేసుకోవడం, రాజకీయాలకు,ఎన్నికలకు వాడుకోవడం సరికాదని దాడుల్లో స్వయంగా పాల్గొన్న ఆర్మీ మాజీ లెప్టినెంట్ జనరల్ డీఎస్ హుడా హితవు పలికారు. దాడుల విషయాన్ని ప్రభుత్వం గోప్యంగా ఉంచివుండే బాగుండేదన్నారు. దాడులను ఎన్నికల కోసం రాజకీయాల కోసం ఉపయోగించుకోవడం చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. 2016 సెప్టెంబర్‌లో ఈ దాడులు జరిగినప్పుడు హూడా నార్తెర్న్‌ ఆర్మీ కమాండర్‌గా ఉన్నారు.‘దాడులపై మరీ అతిగా ప్రచారం చేస్తున్నారు. ఆ సైనిక ఆపరేషన్ చాలా ముఖ్యమైనది. మేం చేయాల్సింది. కానీ దాన్ని రాజకీయం చేశారు..  అది తప్పో ఒప్పో రాజకీయ నాయకులనే అడగాలి.. ఇది మంచిపద్దతి కాదు.. ఇది ఆర్మీకి సంబంధించిన విషయం. అలాగే ఉండనివ్వాలి. ప్రచారం సరికాదు.. ఇలాంటి దాడుల లక్ష్యం వ్యూహాత్మకమైంది.. అది శత్రువుల ధైర్యాన్ని దెబ్బతీస్తుంది’ అని చండీగఢ్  మిలిటరీ లిటరేచర్ ఫెస్టివల్ కార్యక్రమంలో ఆయన అన్నారు. సర్జికల్ దాడుల గురించి కాస్త చెప్పుకుంటే సైనికుల స్థైర్యం పెరుగొచ్చుగాని, అతి ప్రచారం మాత్రం సరికాదని అన్నారు. మిలిటరీ చర్యలను రాజకీయ నాయకులు ఉపయోగించుకోకుండా సైన్యం అడ్డుకోవాలని కోరారు.