తూర్పు ఆసియా దేశం తైవాన్‌లో ప్రకృతి బీభత్సం సృష్టించింది. హోవాలియెన్ పట్టణంలో మంగళవారం రాత్రి 11:50 నిమిషాలకు భారీ భూకంపం సంభవించింది. పెద్ద పెద్ద భవనాలు, ఇతర నిర్మాణాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. భవనాల శిథిలాల కింద వందల మంది చిక్కుకుపోయారు. భూకంపం తర్వాత 100 సార్లు భూమి కంపించడంతో జనాలు భయాందోళనలతో వీధుల్లోకి పరిగెత్తారు. .
తూర్పు తైవాన్‌లోని హోవాలియెన్ పట్టణానికి 21 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని అమెరికా జియాలజికల్ సోసైటీ గుర్తించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదు అయింది. ప్రఖ్యాత మార్షల్ హోటల్ భవనం కుప్పకూలిపోయిన దృశ్యాలు చాలా భయానకంగా ఉన్నాయి. ఆ హోటల్ నుంచి చాలా మంది తప్పించుకున్నారు. ఇంకా హోటల్ భవనం శిథిలాల కింద 50 మంది ఉండొచ్చని అధికారులు అంటున్నారు. అటు నివాస సముదాలు కూడా చాలా వరకు దెబ్బతిన్నాయి. పెద్ద సంఖ్యల్లో బాధితులు శిథిలాల కింద చిక్కుకున్నారు. భూకంప ప్రభావం తీవ్రంగా ఉండడం వలన ప్రభుత్వం ఎమర్జెన్సీని ప్రకటించింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.