తండ్రి ఆస్తులు తీసుకోండి.. అప్పులూ కట్టండి - MicTv.in - Telugu News
mictv telugu

తండ్రి ఆస్తులు తీసుకోండి.. అప్పులూ కట్టండి

February 9, 2018

‘ కన్నతండ్రి నుండి కొడుకులు ఆస్తులు పంచుకోవడం మాత్రమే కాదు, తండ్రికున్న అప్పులను కూడా పంచుకోవాలని ’ మద్రాస్ హైకోర్ట్ సంచలన తీర్పు ఇచ్చింది. తన తండ్రి నివాసంలో పనిచేస్తూ మరణించిన ఓ కార్మికుడి కుటుంబానికి చెల్లించని నష్టపరిహారాన్ని ఆయన తనయుడు చెల్లించాలంటూ తీర్పునిచ్చింది. చెన్నైలోని సైదాపేటలో సదరు కార్మికుడు మరణించి 17 ఏళ్ల తర్వాత కోర్టు ప్రస్తుతం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. 

ఆగస్టు 26, 2001న మరణించిన నరసింహన్ చట్టబద్ధ వారసురాలు ఆదిలక్ష్మి. ఆమెకు రూ.10 లక్షల పరిహారాన్ని చెల్లించాలంటూ ఆగస్టు 21, 2017న చెన్నై కార్పొరేషన్ జారీ చేసిన ఆదేశాన్ని సవాలు చేస్తూ ఎ.రవిచంద్రన్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశాడు.  పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఈ మేరకు వ్యాఖ్యానించారు. బాధిత కుటుంబానికి తమ తండ్రి ఎప్పుడో పరిహారం చెల్లించాడని పిటిషనర్ వాదించాడు. ఈ ఘటన జరిగిన 15 ఏళ్ల తర్వాత 2016లో ఆదిలక్ష్మి తరుపున చెన్నై కార్పొరేషన్ నష్ట పరిహారం కోరింది. ఇది తర్వాత పుట్టిన ఆలోచన అని పిటిషనర్ వాదిస్తూ కోర్టును ఆశ్రయించాడు. కానీ కోర్టు అతని విన్నపాన్ని కాదంది. మరో రెండు నెలల్లో బాధిత కుటుంబానికి నష్ట పరిహారాన్ని చెల్లించాల్సిందేనని తీర్పిచ్చింది.

తీర్పు సందర్భంగా జస్టిస్ ఎస్ వైద్యనాథన్ మాట్లాడుతూ…‘ మన పురాణాలు, శాస్త్రాల్లో నైతిక బాధ్యతల గురించి వుంది. రుణం చెల్లించకపోవడం పాపం అవుతుంది. అలాంటి వారు నరకానికి వెళ్తారు. రాముడు తన తండ్రి మాటకు కట్టుబడిన రీతిలో పిటిషనర్‌ బాధిత కార్మికుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఉంది ’అని అన్నారు.