పిల్లలిక పుస్తకాలతో మాట్లాడతారు - MicTv.in - Telugu News
mictv telugu

పిల్లలిక పుస్తకాలతో మాట్లాడతారు

February 24, 2018

పుస్తకాలను చదవటంలో ఇన్ని రోజులు నోటికి, కళ్ళకు పని చెప్పిన విద్యార్థులు ఇక నుండి చెవులకు మాత్రమే పని చెప్పాలి. ఎందుకంటే త్వరలో మాట్లాడే పుస్తకాలు రానున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం వీటిని సిద్ధం చేస్తున్నారు. తెలుగు, ఆంగ్లంలో వీటిని ముద్రించారు. తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ పరిధిలోని సర్వశిక్షా అభియాన్ సహకారంతో వీటిని యూనిసెఫ్ తయారు చేస్తోంది. ఒక్కో పాఠశాలకు తెలుగు, ఆంగ్ల మాధ్యమం పుస్తకాలను పంపిస్తామని విద్యా శాఖ కమీషనర్ కిషన్ తెలిపారు. ఈ పుస్తకాల ప్రత్యేకతగా డాల్ఫియో టాకింగ్ పెన్ (రీడర్)ని చెప్పుకోవాలి. దీని ఖరీదు సుమారు రూ.2500. దీని రూపకల్పనకు సంబంధించిన సాఫ్ట్‌వేర్ కోసం సుమారు రూ.70 లక్షలు ఖర్చు చేసినట్లు అధికారులు తెలిపారు.హరిత పర్యావరణం, పెంపుడు జంతువులు, బాల కార్మికులు, వ్యక్తిగత పరిశుభ్రత,  పౌష్టికాహారం, జీవన నైపుణ్యాలు, స్వచ్ఛ పర్యావరణం,  బాలికా విద్య, నీటి నిర్వహణ వంటి పది అంశాల మీద కథల రూపంలో ఈ పుస్తకాలను రూపొందించారు.ఒక్కో మాధ్యమంలో 100 రకాల పుస్తకాలున్నాయి. వీటిని బెంగళూరులో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ముద్రించారు. మొదటి దశ కింద వంద ప్రాథమిక పాఠశాలలకు వీటిని పంపిణీ చేస్తారు. వచ్చే విద్యా సంవత్సరం మరో 400 బడులకు అందజేస్తారు. ఈ పెన్‌ని పుస్తకంలోని ఏ పదంపై ఉంచితే అంతవరకు మాట వినిపిస్తుంది. ఒకవేళ ఒక వరుసపై పెడితే ఆ మొత్తాన్ని చదివేలా రీడర్‌లో మార్పు చేసుకోవచ్చు. అంతేకాక పుస్తకంలోని బొమ్మల వద్ద ఉంచితే వాటి సంభాషణనూ వినేలా రూపొందించారు.