మహిళా విలేఖరి చెంప తాకి.. చిక్కుల్లో పడిన తమిళనాడు గవర్నర్ - MicTv.in - Telugu News
mictv telugu

మహిళా విలేఖరి చెంప తాకి.. చిక్కుల్లో పడిన తమిళనాడు గవర్నర్

April 18, 2018

తమిళనాడు గవర్నర్‌ బన్వరీలాల్‌ పురోహిత్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ మహిళా విలేకరి చెంపను తాకి అనుచితంగా ప్రవర్తించారు. ఇప్పటికే ఆయనపై మధురై కామరాజు విశ్వవిద్యాలయం అసిస్టెంట్ లెక్చరర్ నిర్మలాదేవితో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

మంగళవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన  విలేకరుల సమావేశంలో 78ఏళ్ల భన్వరీలాల్‌ తనకు నిర్మలాదేవి ఎవరో తెలియదని వెల్లడించారు. అయితే సమావేశం అయ్యాక  వేదిక దిగి కిందకు వెళ్లేప్పుడు ఓ మహిళా విలేఖరి‌ ఓ ప్రశ్న అడగగా ఆయన సమాధానం చెప్పకుండా ఆమె చెంపపై తాకారు. దీంతో  అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా షాకయ్యారు.‘ద వీక్‌’ అనే పత్రికలో పనిచేసే  మహిళా విలేఖరి లక్ష్మి సుబ్రమణియన్‌ ఘటన అనంతరం దీనిపై ట్విటర్‌లో స్పందించింది. ‘ సమావేశం ముగిసి వెళ్తున్న సమయంలో నేను గవర్నర్‌ను ఓ ప్రశ్న అడిగాను. దీనికి ఆయన సమాధానంగా నా అనుమతి లేకుండా చెంపపై తాకారు. ఇది చాలా అనైతిక ప్రవర్తన. అనుమతి లేకుండా పరాయి వారిని తాకడం ఏమాత్రం సబబు కాదు. అందులోనూ ఓ మహిళను తాకడం సరైనది కాదు.ఈ ఘటన తర్వాత నా ముఖాన్ని పలుమార్లు కడుక్కున్నాను, అయినా ఇంకా దాని నుంచి బయటకు రాలేకపోతున్నాను. గవర్నర్‌ పురోహిత్‌ పట్ల నాకు చాలా కోపంగా ఉంది. ఆయన తాకడం ప్రశంసాపూర్వకంగా కావొచ్చు, ఓ తాతయ్యలాగా కావొచ్చు.. ఏదైనా కావొచ్చు కానీ నా ఉద్దేశం ప్రకారం అలా చేయడం తప్పు ’ అని ఆమె ట్విటర్ ద్వారా  వెల్లడించారు.

రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండి ఆయన ఇలా చేయడం సరికాదని డీఎంకే ఎంపీ కనిమొళి అన్నారు. ఆయన ఉద్దేశం ఏదైనా కావొచ్చు కానీ, ఓ మహిళ గౌరవానికి భంగం కలగించేలా ఉందని విమర్శించారు. డీఎంకే కార్యనిర్వహక అధ్యక్షుడు ఎం.కె స్టాలిన్‌ కూడా గవర్నర్‌ ప్రవర్తనను తప్పు పడుతూ ట్వీట్‌ చేశారు.