తెలంగాణ ప్రభుత్వం గొల్లకుర్మలకు గొర్రె పిల్లలు పంపిణీ చేస్తుండం తెలిసిందే. గ్రామీణుల ఆర్థిక స్వావలంబన కోసం ఇలాంటి మరెన్నో పథకాలు అమలు చేస్తోంది. తమిళనాడు ప్రభుత్వం కూడా ఈ బాట పట్టింది. నాటుకోళ్ల పెంపకం పథకానికి గురువారం నుంచి శ్రీకారం చుట్టింది. తొలి విడతగా 77 వేల మంది మహిళలకు ఈ పథకాన్ని వర్తింపజేసింది. సచివాలయంలో పదిమంది లబ్ధిదారులకు తలా యాభై చొప్పున నాటు కోళ్లను అందజేశారు ముఖ్యమంత్రి పళనిస్వామి. వీటిద్వారా తమ జీవనోపాధిని మెరుగుపరచుకోవాలని వారికి సీఎం పిలుపునిచ్చారు. గ్రామాల్లోని పేద మహిళల ఆర్థికాభివృద్ధికై గతేడాది అసెంబ్లీ వేదికగా ఈ పథకాన్ని సీఎం ప్రకటించారు. ఇప్పటికే రాష్ట్ర పశు సంవర్థక శాఖ నేతృత్వంలో ఆవులు, మేకల పెంపకం, అభివృద్ధి పథకం అమల్లో ఉండగా ఈ పథకాన్ని అమలుచేయ తలపెట్టింది తమిళనాడు ప్రభుత్వం. మహిళా లబ్దిదారులకు ఆవులు, మేకలను అందించినట్టే రైతులకు నాటుకోళ్ల పెంపకం నిమిత్తం ప్రత్యేక ప్రోత్సహాన్ని అందిస్తోంది.
తొలుత ఈ పథకం కోసం రూ.25 కోట్లు కేటాయించగా, పథకం అమల్లో జాప్యం రావడంతో అదనంగా మరో 25 కోట్లను పెంచారు. దీంతో 50 కోట్లతో తొలి విడతగా ఈ పథకానికి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ సాగింది. ఒక్కో పేద మహిళా లబ్ధిదారుకు 50 నాటు కోళ్లను పంపిణీ చేయడానికి నిర్ణయించారు.
అనంతరం నాబర్డ్ నేతృత్వంలో జరిగిన సదస్సులో రైతుల ఆదాయ మార్గం పెంపునకు తగ్గ కార్యాచరణ, ప్రభుత్వ సహకారం గురించి సీఎం ప్రసంగించారు. చెన్నై ఎంఆర్సీ నగర్లో రూ.73 కోట్లతో నిర్మించిన రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని పలు విభాగాల కోసం నిర్మించిన పరిపాలనా భవనాన్ని ప్రారంభించారు.
Telugu news Tamil Nadu govt launches free country chicken scheme for rural women