పళని  ప్రభుత్వం కూలిపోతుంది - MicTv.in - Telugu News
mictv telugu

పళని  ప్రభుత్వం కూలిపోతుంది

October 27, 2017

కమల్ హాసన్ వచ్చే నెల 7న తన బర్త్ డే సందర్భంగా పార్టీ ఏర్పాటుపై కీలక ప్రకటన చేయనున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన తమిళనాడులోని పళనిస్వామి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. తమిళనాడులో పనికిరాని ప్రభుత్వం ఉందని, అది తొందరలోనే కుప్పకూలిపోతుందని వరుసగా ట్వీట్లు చేశాడు.

చైన్నైలోని కోసాన్ థళై నది విషయంలో జాలర్లు  తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘రైతులు 1099 ఎకరాల భూమిని నష్టపోయారు. వల్లూరు థర్మల్ ప్లాంట్, ఉత్తర చైన్నై పవర్ ప్లాంట్‌కు చెందిన చెత్తాచెదారాలు వచ్చి నదిలో చేరుతున్నాయి. వాటిని తొలగించడానికి ప్రభుత్వం చర్యలను తీసుకోవడం లేదు.

ఆ ప్లాంట్ల నుంచి కలుషితాలు నదిలో కలువడం వలన ప్రజలు, జాలర్లు నానా ఇబ్బందులూ  పడుతున్నారు. దీనికి తోడు హిందూస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం సంస్థలు నదిలో టర్మినళ్లు నిర్మించాయి… బడాబాబులు, రియల్ ఎస్టేట్ వాళ్లకు కొమ్ముకాస్తూ పేదప్రజలకు పట్టించుకోని ఈ పాడు ప్రభుత్వం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే’ అని కమల్ శాపాలు పెట్టారు.

చెన్నై వరదల అంశాన్నీ ఆయన ప్రస్తావించారు. ‘ఉత్తర చైన్నైలో తేలికపాటి వర్షం పడినా రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి. ఆ ఏడాది భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరింది. అదే జరిగితే పది లక్షల జీవితాలు అంధకారమైపోతాయి. ఈ సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం  వెతకాలి’ అని ట్వీట్ చేశాడు.