తమిళ నటుడు విశాల్‌కు ఆదాయపు పన్నుశాఖ సమన్లు జారీచేసింది. ఈ నెల 27న ఆదాయపు పన్ను కార్యాలయంలో హాజరు కావాలని అదేశించింది. సోమవారం ఛైన్నై వడపళనిలోని విశాల్ ఫిల్మ్ కంపెనీ కార్యాలయంలో ఆదాయపు పన్నుశాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ సోదాల్లో రూ. 51 లక్షల పన్ను విశాల్ చెల్లించనట్టు అధికారులు తెలిపారు. విశాల్ కార్యాలయం నుంచి కొన్ని ముఖ్యమైన ఆధారాలను ఆదాయపు పన్ను శాఖ అధికారులు తీసుకెళ్లారు.
మోదీ సర్కారు వేసిన జీఎస్టీని విమర్శించిన మెర్సల్ చిత్రానికి విశాల్ మద్దతు తెలపడం, చిత్రం పైరసీ కాపీని చూసిన బీజేపీ నేత హెచ్ .రాజాను విమర్శించడం వల్లే ఆయన కార్యాలయంపై దాడులు జరిగాయంటున్నారు. దీనిపై విశాల్ మాత్రం తన ఆదాయానికి సంబందించి లెక్కలన్నీ సరిగ్గానే ఉన్నాయని, ఒకవేళ తనపై కావాలనే కక్ష సాధింపుచర్యలకు పాల్పడితే వాళ్లను తగిన విధంగా ఎదుర్కొంటానని హెచ్చరించారు. రాష్ట్రంలో చాలా ముఖ్యమైన సమస్యలు ఉన్నాయని, వాటిపై దృష్టి పెట్టాలని నేతలకు సూచించాడు.