బాలకృష్ణ కామెంట్లపై నాగబాబు షార్ట్‌ఫిల్మ్.. ఎర్రోడి వీరగాథ - MicTv.in - Telugu News
mictv telugu

బాలకృష్ణ కామెంట్లపై నాగబాబు షార్ట్‌ఫిల్మ్.. ఎర్రోడి వీరగాథ

January 9, 2019

చూడబోతే బాలకృష్ణను, నాగబాబు అంత ఈజీగా వదిలిపెట్టేలాలేరనిపిస్తోంది. గతకొన్ని రోజులుగా బాలయ్యను టార్గెట్ చేసి వరుస వీడియోలు వదులుతున్నారు నాగబాబు. బాలకృష్ణ నోరుజారిన సందర్భాలంటూ వాటికి కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా ఆయన  ‘ఎర్రోడి వీరగాథ’ పేరుతో ఏకంగా షార్ట్‌ఫిల్మ్‌నే విడుదల చేశారు. ఇవాళ ఎన్టీఆర్ బయోపిక్ సినిమా విడుదల కానుండగా ఈ షార్ట్‌ఫిల్మ్ విడుదల చేయడం ఫిల్మ్‌నగర్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మూడున్నర నిమిషాల నిడివిగల ఈ షార్ట్‌ఫిల్మ్‌లో నాగబాబు నటించారు.

గతంలో ఓ ఆడియో ఫంక్షన్‌లో బాలకృష్ణ మాట్లాడుతూ ‘ఆడపిల్ల కనబడితే ముద్దైనా పెట్టాలి.. కడుపైనా చేయాలి’ అన్న వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఈ షార్ట్‌ఫిల్మ్‌ను రూపొందించారు నాగబాబు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది ఈ షార్ట్‌ఫిల్మ్. ఇందులో నాగబాబు కార్లో వెళ్తుండగా దారిలో ఓ వ్యక్తిని పట్టుకుని ఆడవాళ్లు చితగ్గొడుతుంటారు. కారు ఆపి చూస్తారు నాగబాబు. ఏం గొడవో మనకెందుకులే అనుకుని వెళ్లిపోతారు. ఆ తర్వాత రెండు మూడు సార్లు అలాగే ఆడవాళ్లు ఆ వ్యక్తిని చావబాదుతుంటారు. అది చూసి కనుక్కుందామని నాగబాబు అక్కడికి వెళ్తారు. ఒక మగాణ్ణి పట్టుకుని అలా కొడతారా వెళ్ళండి అని ఆ ఆడవాళ్ళను చెదరగొడతారు.

తర్వాత ఎందుకు వాళ్ళు నిన్ను కొడుతున్నారని ఆ వ్యక్తిని అడుగుతారు. అతను పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి కదండీ.. అదే చేశానని సమాధానం చెప్తాడు. ఏం చెప్పావని అడగ్గా.. ఆడవాళ్ళు కనిపిస్తే ముద్దైనా పెట్టాలి.. కడుపైనా చెయ్యాలని చెప్పా.. అంతే వాళ్ళొచ్చి తనను కొట్టేస్తున్నారని చెప్తాడు. అది విని నాగబాబు షాక్ అవుతాడు. నీకు తగిన శాస్తే జరుగుతోంది మధ్యలో అనవసరంగా నేనొచ్చానని మళ్ళీ ఆ ఆడవాళ్లను పిలిపించి చావగొట్టిస్తాడు. దీంతో షార్ట్‌ఫిల్మ్ ముగుస్తుంది. టైటిల్స్‌లో ముందుగానే ఇందులోని పాత్రలు ప్రభావితమైనవి అని చెప్తారు. మరి దీనిమీద బాలయ్య అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.Telugu news Target Balakrishna..Naga Babu Errodi Veeragatha Shortfilm