తెలంగాణలో మళ్లీ జెండా ఎగరేద్దాం.. - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో మళ్లీ జెండా ఎగరేద్దాం..

November 2, 2017

ఎన్ని సమస్యలు ఎదురైనా అధిగమించి తెలంగాణలో టీడీపీ జెండాను మళ్లీ ఎగరేయాలని పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. తమ్ముళ్లకు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో గురువారం జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీని తెలంగాణలో బలోపేతం చెయ్యటానికి నెలనెలా సమీక్షలు జరపాలని అన్నారు. పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్ళే ప్రణాళికలు వెయ్యాలని సూచించారు.‘తెలంగాణ‌లో టీడీపీ జెండా మ‌ళ్లీ ఎగ‌రాలి.. అంద‌రికీ న్యాయం జ‌ర‌గాలి. హైదరాబాదులో మత సామరస్యాన్ని కాపాడిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. పదేళ్లు ప్రతిపక్ష పార్టీగా వున్నాం. తెలంగాణ‌లో త‌మ పార్టీ 15 సీట్లు గెలిచింది, త‌మ‌ మిత్ర‌ప‌క్షం బీజేపీ 5 సీట్లు గెలిచింది. కానీ ఆ త‌రువాత జ‌రిగిన దారుణాన్ని చెప్పడం నాకిష్టం లేదు. తెలుగుదేశం పార్టీ అహర్నిశలు తెలుగువారి కోసం పని చేస్తుంది. అధికారంలో ఉన్నా, ప్ర‌తిప‌క్షంలో ఉన్నా తెలుగు వారి సంక్షేమ‌మే కోరుతుంది. తెలుగు దేశం పార్టీని న‌మ్ముకున్న కార్య‌క‌ర్త‌ల‌కు అండ‌గా ఉంటాం. తాము బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాలు, షెడ్యూలు కులాలు, తెగ‌ల‌వారికి అండ‌గా ఉన్నాం. సైబ‌రాబాద్ నిర్మాణం చేసింది టీడీపీనే.  అమ‌రావ‌తిని కూడా నిర్మాంచాల‌ని దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడ‌ు. పార్టీ కోసం పని చేసే త‌మ‌ నాయ‌కుల‌పై, కార్య‌క‌ర్త‌ల‌పై న‌మ్మ‌కం ఉంది. పార్టీకి వ్య‌క్తిగ‌తంగా ఎవ‌రిపైనా విద్వేషం లేదు. తెలంగాణాలో పార్టీ ప్రాబల్యానికి యుద్ధం చేయాల్సిన అవ‌స‌రం లేదు.. ప్ర‌జా సేవ చేస్తే ప్ర‌జ‌లే ఆద‌రిస్తారు. స‌మాజంలో ఇబ్బందుల్లో ఉన్నవారికి తెలుగు దేశం పార్టీ ఎప్పుడూ అండ‌గా ఉంటుంది. తప్పకుండా తెలంగాణాలో టీడీపీ నిలబడుతుంది’ చెప్పారు. టీటీడీపీ చీఫ్ రమణతోపాటు పలువురు కీలక నేతలు పాల్గొన్న సమావేశంలో రేవంత్ రెడ్డి అంశం చర్చకు వచ్చింది.