జన్మభూమి- మా ఊరులో రాళ్లతో కొట్టుకున్నారు..

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో కొన్ని చోట్ల ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. నిన్న కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం పెద ఓగిరాలలో నిర్వహించిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ వర్గాలు కొట్టుకున్నాయి. ఎమ్మెల్యే బోడెప్రసాద్‌, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ హజరై సభ నిర్వహిస్తుండగా అదే సభకు వైకాపా జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారధి హాజరయ్యేందుకు వెళ్లారు. దీంతో సారథి, బోడె ప్రసాద్‌కు మధ్య వాగ్వాదాలు, తోపులాటలు జరిగాయి.

Telugu News TDP & YCP activists clash at Janmabhoomi programme in Vuyyuru .

ఈ రోజు కూడా మరోమారు అదే ఘర్షణలు కొనసాగుతాయని ఊహించిన పోలీసులు గ్రామానికి వచ్చే మార్గంలో జాతీయ రహదారిపై భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. అక్కడకు చేరుకున్న పార్థసారథిని సభా ప్రాంగణం లోపలకు పంపకుండా అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బోడెప్రసాద్‌ సభ నుంచి తిరిగి వెనక్కి వెళ్లిపోయేందుకు రోడ్డుపైకి వచ్చారు. ఎమ్మెల్యేను చూసిన సారథి వర్గీయులు నినాదాలు చేయడంతో ఎమ్మెల్యే తన వాహన సముదాయాన్ని ఆపి ప్రశ్నించడంతో మరోమారు ఘర్షణ వాతావరణం నెలకొంది. అప్పటికే రెండు వర్గాల అనుచరులు రాళ్లు విసురుకున్నారు. ఈ క్రమంలో తోపులాటలు కూడా చోటుచేసుకున్నాయి. రెండు వర్గాల వారిని వారించి పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వారిని అక్కడ నుంచి పంపించేశారు.

Telugu News TDP & YCP activists clash at Janmabhoomi programme in Vuyyuru