తెలంగాణకు ప్రథమ శత్రువు కాంగ్రెస్సే.. కేసీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణకు ప్రథమ శత్రువు కాంగ్రెస్సే.. కేసీఆర్

March 14, 2018

ఆంధ్ర, తెలంగాణలను విలీనం చేసి కాంగ్రెస్ తెలంగాణను నాశనం చేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఆ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే తెలంగాణ సర్వనాశం అయిపోయేది. రాష్ట్రానిక నంబర్ వన్ శత్రువు కాంగ్రెస్సే..’ అని సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. ఆయన బుధవారం అసెంబ్లీలో సుదీర్ఘ ప్రసంగం చేశారు. కాంగ్రెస్‌ను దుయ్యబడుతూ, టీఆర్ఎస్ విజయాలను ప్రస్తావిస్తూ దాడి సాగించారు.

‘మేం లక్షల కోట్ల అప్పులు  చేస్తున్నాం అని ప్రతిపక్షాలు  విమర్శలు చేస్తున్నాయి. వాళ్ల విమర్శలు  అర్థరహితం. తెలంగాణ వచ్చే నాటికే రాష్ట్ర అప్పు రూ. 72 వేల కోట్లు.  ఇప్పుడు అన్నీ కలిపి 142 వేల కోట్లు ఉన్నది. మేం ఇష్టం వచ్చినట్లు అప్పులు  చేయలేదు. మేం చేసే ప్రతి అప్పుపై ఆర్‌బీఐ నిఘా ఉంటుంది. ఇవన్నీ తెలిసి కూడా  ప్రతిపక్షాలు విమర్శలు చేయడం విడ్డూరం. బీజేపీ కిషన్ రెడ్డి చెప్పిన లెక్కల్లో ఏమాత్రం వాస్తవం లేదు’ అని కేసీఆర్ అన్నారు.

‘అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తామంటే చూస్తూ ఊరుకోం. దేనికైనా ఓ పద్ధతి ఉంటుంది. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించినందుకు  ఇప్పటికే ఇద్దరి శాసన సభ్యుల సభ్యత్వాలు రద్దు చేశాం. మరో ఇద్దరివి కూడా రద్దు చేసే ఆలోచనలో ఉన్నాం. మీ ఇష్టం వచ్చినట్లు ఆందోళనలు చేస్తామంటే కుదరదు. ఆందోళనలపై నిషేధం కొనసాగుతుంది. అది మేం వచ్చిన తర్వాత పెట్టింది కాదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలు చేసింది. ముమ్మాటికి  కాంగ్రెస్సే తెలంగాణకు నంబర్ వన్ శత్రువు. ఆంధ్రా ప్రాంతాన్ని తెలంగాణలో కలిపింది కాంగ్రెస్సే.. తెలంగాణ ఉద్యమంలో 400 మందిని కాల్చి చంపింది కాంగ్రెస్సే. తెలంగాణను మొత్తం నాశనం చేసింది కాంగ్రెస్. అట్లాంటిది తెలంగాణను మేమే ఇచ్చాాం అని వాళ్లు చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది.

తెలంగాణ కోసం రాజీనామాలు చేస్తా అన్నారు. చేశారా? తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను ఏం చేస్కుంటారో చేస్కోండి అని  కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే ఏ ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే నోరు విప్పలేదు. తెలంగాణకు అసలు శత్రువు కాంగ్రెస్ అనే దానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి’ అని కేసీఆర్ అన్నారు. రాజకీయ సుస్థిరత కోసమే ఇతర పార్టీల సభ్యులను తమలో కలుపుకున్నామన్నారు. కాంగ్రెస్ నేతలు విజయశాంతిని అడవిపాలు చేశారని అన్నారు. హైదరాబాద్‌పై రాజీపడి ఉంటే నాలుగేళ్ళ ముందే తెలంగాణ వచ్చేదన్నారు..