mictv telugu

కేసీఆర్ ఓటు వేసేది ఎక్కడో తెలుసా?

December 6, 2018

బతుకు తెరువు కోసమో, మరో వ్యవహారం కోసమో ఎక్కడ నివసిస్తున్నాఎన్నికల కాలం వచ్చేసరికి  జన్మించిన ఊళ్లోనే ఓటు హక్కు ఉండడం, అక్కడే ఓటు వేయడం ఓ సంబరం. అందుకే ఎందరో ఓటర్లు విద్య, ఉద్యోగ నిమిత్తం ఏ నగరంలో జీవిస్తున్నా ఓటు హక్కు మాత్రం జన్మించిన ఊళ్ళోనే ఉపయోగించుకోవడానికి మొగ్గు చూపుతారు. ఇందుకు గొప్ప గొప్ప వాళ్ళు కూడా అతీతం కాదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇందుకు మంచి ఉదాహరణ. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.

dfd

ఇప్పటికే హైదారాబాద్ నగరంలో నివసిస్తున్న ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడానికి స్వంత గ్రామాలకు పయనమయ్యారు. ఈ తరుణంలో కేసీఆర్ దంపతులు స్వగ్రామం చింతమడకలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సిద్దిపేటలో హరీశ్‌రావు దంపతులు ఓటు వేయనున్నారు. సిద్దిపేట మండలం చింతమడకలోని బూత్ నెంబర్ 13లో సతీ సమేతంగా కేసీఆర్ ఓటు వేయనున్నారు. సిద్దిపేట పట్టణం బూత్ 107లో అంబిటస్ స్కూల్లో హరీశ్‌రావు సతీ సమేతంగా ఓటు వినియోగించుకోనున్నారు. ఉదయం 8 గంటలకు చింతమడకలో కేసీఆర్, సిద్దిపేటలో హరీశ్‌రావు ఓటు వేయనున్నారు. ప్రముఖులు ఓటు వేసే బూత్‌ల్లో అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చింతమడకలో హెలిప్యాడ్ ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. ఓటు హక్కు వినియోగించుకున్న తరువాత కొంత సమయం గ్రామస్తులతో గడిపి తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు కేసీఆర్. గతంలో కేసీఆర్ పలుమార్లు స్వగ్రామం చింతమడకలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.