mictv telugu

తెలుగు తెరపై తెలంగాణ హీరోయిన్లు…

August 19, 2018

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడి చరిత్రకారులు, ఉద్ధండులు, కళాకారులు, కవులు, రచయితలు, దర్శకులు, నటీనటుల గురించి తెలుసుకోవడం మొదలైంది. అందుకు చాలా మంది మేధావులు పూనుకుని ఒక్కక్కటిగా వెలికి తీస్తున్నారు. ప్రస్తుతం సినిమా విషయానికి వస్తే.. ఇక్కడి ప్రాంతం నుంచి ఎంత మంది సినిమా రంగంలో వున్నారు అనేది పదేపదే చర్చకు వస్తోంది. తెలుగు తెరపై తన అసమాన నటనతో వెలుగులు విరజిమ్మిన కత్తి కాంతారావును మినహాయిస్తే అంత పేరు చాలా కాలం తర్వాత కొంత మంది నటులకు వచ్చింది. కరీంనగర్‌లో పుట్టిన పైడి జయరాజ్ హిందీ సినిమాల్లో నటించి తెలంగాణ ఖ్యాతిని దశదిశలా చాటారు.

ఆ తర్వాత చెప్పుకోదగ్గ హీరోల్లో నితిన్ ఒకరు కాగా ఇప్పుడు యూత్ ఐకాన్‌గా మారిన విజయ దేవరకొండ ఒకరు. వేణుమాధవ్, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేశ్, ఛమ్మక్ చంద్ర, యాదమ్మ రాజు వంటి కొందరు కమెడియన్లు కూడా తెలుగు తెరను ఏలుతున్నారు. అలాగే యాంకర్లలో కూడా సీనియర్ యాంకర్ ఉదయభాను నుంచి మొదలు పెడితే ప్రభాకర్, శ్రీముఖి, రవి, అనసూయ, బిత్తిరి సత్తి, సావిత్రిలాంటి వారు బుల్లితెర మీద తమ సత్తా చాటుతున్నారు. గాయకులుగా మధుప్రియ, మంగ్లీలు ప్రస్తుతం తెలంగాణ బ్రాండ్ సింగర్స్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అదలా వుంచితే హీరోలు, దర్శకుల గురించి చాలా సందర్భాల్లో మీడియా పేర్కొనడం జరిగింది. హీరోయిన్లు కూడా ఈ ప్రాంతం నుంచి ఎంతమంది వున్నారు ? ఈ వరుసలో సీనియర్ హీరోయిన్ ‘ముత్యాల ముగ్గు సంగీత’ తొలుత నిలబడుతుందని చెప్పొచ్చు. ఆ తర్వాత లేడీ అమితాబ్ విజయశాంతి, కీర్తిరెడ్డి, ఈరోజుల్లో రేష్మ రాథోడ్ వంటివారు వున్నారు.

ముత్యాలముగ్గు సంగీత..

Image result for సంగీత

వరంగల్‌లో జన్మించిన సంగీత 1975లో సినిమారంగంలోకి ప్రవేశించారు. బాపు దర్శకత్వంలో వచ్చిన ‘ముత్యాల ముగ్గు’ సినిమాతో కెరియర్ ప్రారంభించారు. ఆ తర్వాత ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. చిలకమ్మ చెప్పింది, రతి మన్మథ, ఖైదీ, గోల్‌మాల్ వంటి అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు. హీరోయన్‌గా రిటైరయ్యాక కూడా తన కెరియర్‌ను కొనసాగించారు. అమ్మ పాత్రల్లో కూడా నటించారు. ఈమధ్య రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు ఆమధ్య వార్తలు కూడా వచ్చాయి.

విజయశాంతి..

చిత్ర రంగంలో ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అఖ్ఖర్లేదు. లేడీ అమితాబ్‌గా సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఏర్పరుచుకున్న నటి విజయశాంతి. వరంగల్‌లో పుట్టి చెన్నైలో పెరిగారు. 1980లో సినిమాల్లోకి వచ్చారు. ‘పండంటి జీవితం’ ఆమె తొలి సినిమా. మహిళా ప్రధాన చిత్రాల దశ విజయశాంతి నుంచే మొదలైందని చెప్పొచ్చు. కర్తవ్యం, భారతనారి, గ్యాంగ్ లీడర్, ఒసేయ్ రాములమ్మ నుంచి నాయుడమ్మ వరకు ఆమె సినిమా కెరియర్ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగింది.

తర్వాత రాజకీయాల్లోకి వచ్చి సొంతంగా ‘తల్లి తెలంగాణ’ పార్టీ కూడా స్థాపించి అక్కడ కూడా తన ముద్ర వేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మెదక్ ఎంపీగా తన సేవలను అందించారు. ప్రస్తుతం రాజకీయాలకు, సినిమాలకు దూరంగా వుంటున్నారు.

కీర్తిరెడ్డి..

పవన్ కల్యాణ్ నటించిన ‘తొలిప్రేమ’ పేరు ఎత్తగానే అందులో తెల్లని గౌనులో, చిచ్చుబుడ్ల వెలుగులో ఇంట్రడక్షన్ ఇచ్చే కీర్తిరెడ్డిని తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోరు. నిజామాబాద్‌ జిల్లాలో జన్మించిన కీర్తిరెడ్డి రాజకీయ వారసురాలు. కానీ అనూహ్యంగా సినిమాల్లోకి వచ్చి తనదైన ముద్ర వేసింది. 1996లో ‘గన్‌షాట్’ సినిమాతో బోణీ కొట్టి అనేక చిత్రాల్లో నటించింది. ‘తేరా జాదూ చల్‌గయా’ అనే హిందీ చిత్రంలోనూ నటించింది. హీరోయిన్‌గా బిజీగా వున్నప్పుడే ‘అర్జున్’ సినిమాలో మహేష్‌కు అక్కగా నటించింది. ఆ తర్వాత హీరో సుమంత్‌ను పెళ్ళి చేసుకొని, రెండేళ్ళకే విడాకులు తీసుకుంది. ఆ తర్వాత వేరే వ్యక్తిని పెళ్ళి చేసుకుని బెంగుళూరులో సెటిల్ అయింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా వుంది.

ప్రత్యూష..

నా పెదవుకి నవ్వులు నేర్పావు.. ప్రయా నీకు జోహారు’ అనే పాటలో ప్రత్యూష ఎంత అందంగా కనిపిస్తుందో వర్ణించ తరంకాదు. భువనగిరిలో జన్మించిన ప్రత్యూష తొలుత చిన్న చిన్న చెల్లెలి, స్నేహితురాళ్ళ పాత్రలు వేస్తూ హీరోయిన్ అయింది. హీరోయిన్‌గా స్నేహమంటే ఇదేరా, రాయుడు, శ్రీరాములయ్య, కలుసుకోవాలని, ఇదేం ఊరురాబాబూ వంటి చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంది. తేజ దర్శకత్వంలో వచ్చిన ‘ధైర్యం’ సినిమాలో కూడా తొలుత ప్రత్యూషనే హీరోయిన్‌గా అనుకున్నాడు. కానీ 2002లో ప్రత్యూష హత్యకు గురి కావడంతో ఆ సినిమాలో వేరే అమ్మాయి హీరోయన్‌గా నటించింది. కెరియర్ మంచి ఊపులో వుండగానే ప్రత్యూష ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది.

రేష్మ రాథోడ్..

‘ఈ రోజుల్లో’ సినిమాతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది రేష్మ రాథోడ్. భద్రాద్రి జిల్లా ఇల్లందులో జన్మించిన రేష్మ ఆ తర్వాత బాడీగార్డ్, లవ్ సైకిల్, ప్రతిఘటన, జీలకర్ర బెల్లం వంటి పలు చిత్రాల్లో నటించి తన ప్రతిభను చాటుకుంది. త్వరలో బీజేపీ పార్టీ నుంచి రాజకీయాల్లోకి వస్తున్నట్టు ఈ మధ్య వార్తలు వచ్చాయి.

అదితీ మ్యాకల్..

తెలంగాణ యాస, హిందీ, ఇంగ్లీష్ పదాలు మిక్స్ చేసి క్యూట్‌గా మాట్లాడుతూ అందరినీ అలరించింది అదితీ మ్యాకల్. కామారెడ్డికి చెందిన అదితి తొలుత షార్ట్ ఫిల్మ్స్‌లో, వెబ్ సిరీస్‌లలో నటించి సినిమాల్లో నటిస్తోంది. ‘అమీతుమీ’ ‘అర్జున్ రెడ్డి’ సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకుంది. ఇప్పుడొస్తున్న కొత్త సినిమాల్లో, కొత్త దర్శకులకు అదితీ మ్యాకల్ మంచి ఆప్షన్ అనే చెప్పుకోవచ్చు.

ఆనంది…

వరంగల్‌లో జన్మించిన ఆనంది ‘ప్రియతమా నీవచట కుశలమా’ సినిమాతో తెలుగులో బోణీ కొట్టింది. ఆ తర్వాత ఈ రోజుల్లో, బస్‌స్టాప్, గ్రీన్ సిగ్నల్ వంటి పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తమిళ సినిమాల్లో చాలా బిజీగా వుంది ఆనంది.

అదితీరావ్ హైదరీ..

మహబూబ్ నగర్‌లో పుట్టిన అదితీరావ్ హైదరీ తొలుత తన హవాను మళయాలంలో కొనసాగించింది. ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టింది. ఢిల్లీ6, మర్డర్3, ఫితూర్, పద్మావత్ వంటి సినిమాలతో హిందీలో మంచినటి అనిపించుకుంది. దర్శకుడు మణిరత్నం దృష్టిని ఆకర్షించిన ఈ చిన్నది ‘చెలియా’ సినిమాతో మాతృభాష తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమధ్యే వచ్చిన ‘సమ్మోహనం’ సినిమా అదితీకి నటిగా వందకు వంద మార్కులు ఇచ్చింది.

బిగ్‌బాస్ భానుశ్రీ..

‘నీకు నాకు మధ్య 18’ సినిమాతో తెలుగు తెర మీద తన అందాలతో తళుక్కుమనిపించింది భానుశ్రీ. వరంగల్‌కు చెందిన భానుశ్రీ ఈమధ్య ‘బిగ్‌బాస్’ షోతో చాలా పాపులర్ అయింది. ఆ షోలో భోలాతనంగా వుండి తనదైన ప్రత్యేకతను చాటుకుంది. జెన్యూన్ పర్సన్‌గా హౌజ్‌లో మంచి మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం వరుణ్ సందేశ్ పక్కన ఓ సినిమాలో నటిస్తోంది.

జోగిని శ్యామల..

బోనాల ఉత్సవాలు ప్రారంభం అవగానే తెలంగాణ ప్రాంతంలో గుర్తుకువచ్చే పేరు శ్యామల. జోగిని శ్యామలగా గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లో తనదైన ముద్ర వేస్తోంది శ్యామల. ‘వీరంగం’ సినిమాతో పరిచయమైన శ్యామల అమీతుమీ సినిమాలో నటించి మెప్పించింది. ప్రస్తుతం రెండు సినిమాల్లో హీరోయిన్‌గా చేస్తోంది. ఓ సినిమాలో ప్రాధాన్యం వున్న పాత్రలో నటిస్తోంది. మహబూబ్ నగర్‌కు చెందిన శ్యామల హైదరాబాదులో పెరిగింది.

గాయత్రి గుప్తా

సంగారెడ్డి జిల్లా జోగిపేటలో జన్మించిన గాయత్రి గుప్తా టీవీ యాంకర్‌గా తన కెరియర్‌ను ప్రారంభించింది. ‘పెళ్లికి ముందు’ అనే షార్ట్ ఫిల్మ్ తనకు మంచి పాపులారిటీని తీసుకువచ్చింది. ఆ తర్వాత సినిమాల వైపు తన అడుగులు వేసింది. ఐస్ క్రీం2, ఫిదా వంటి సినిమాల్లో ప్రాముఖ్యమున్న పాత్రల్లో నటించింది. కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్, జంధ్యాల రాసిన ప్రేమకథ, కొబ్బరిమట్ట వంటి చిత్రాల్లో నటించి తన ప్రత్యేకతను చాటుకుంది. త్వరలో రాబోతున్న ‘మిఠాయి’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది గాయత్రి.