1200 సెకన్లు ఆపకుండా వాయించి రికార్డు.. - MicTv.in - Telugu News
mictv telugu

1200 సెకన్లు ఆపకుండా వాయించి రికార్డు..

April 23, 2018

తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక మరుగున పడ్డ కళలు ఇప్పుడు గర్వంగా తలెత్తుకుంటున్నాయి. అందులో భాగంగా డప్పు కళాకారులు కూడా మా డప్పు కళ ఏమాత్రం చిన్నది కాదు. డప్పు కొట్టడం నామోషీగా భావించే రోజులకు కాలం చెల్లింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ కళ కళకళలాడాల్సిందే.. అంటూ డప్పు కళాకారులు దండుగా మారి ఉత్సాహంగా ముందుకు దుమికారు.  

హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఆదివారం కళారవళి సోషియో కల్చరల్‌ అసోసియేషన్‌ 18వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో 700 మంది డప్పు కళాకారులతో గిన్నిస్‌ బుక్‌‌లో నమోదు చేసేందుకు ‘తెలంగాణ స్థాయి డప్పు మహోత్సవం’ను ఘనంగా నిర్వహించారు. పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించుకునేందుకు 1200 సెకన్లు నిరంతరంగా డప్పు వాయించారు. ఎట్టకేలకు గిన్నిస్‌లో డప్పు ప్రాశస్త్యాన్ని నమోదు చేసుకున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి ఈటల రాజేందర్‌ మెమోంటోలను అందజేసి కళాకారులను అభినందించారు.

కళాకారులందరికీ గుర్తింపు వుంటుంది

ఈ కార్యక్రమానికి హాజరైప తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ డప్పు కళాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ .. ‘  ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కళాకారుల పాత్ర మరువలేనిది. ఉద్యమానికి ఊపు తెచ్చిన కళాకారులకు తగిన గుర్తింపును ఇచ్చే దిశలో తెలంగాణ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. రానున్న రోజుల్లో డప్పు కళాకారులకు కూడా తగిన న్యాయం చేసేలా సీఎం ఆలోచన చేస్తున్నారు, తొందర్లోనే డప్పు కళాకారులు శుభవార్త వింటారు’ అని అన్నారు.

హుజురాబాద్ గడ్డ త్యాగాలు, సాహసాల్లో ఎప్పుడూ ముందు వుంటుందని అభిప్రాయపడ్డారు. కళాకారులతోపాటు క్రీడలు, కోలాటాలకు కూడా హుజూరాబాద్‌ గడ్డ నిలయంగా నిలుస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. ఇక్కడి స్ఫూర్తితోనే జిల్లా, రాష్ట్రవ్యాప్తంగా కోలాట నృత్య ప్రదర్శన వ్యాప్తి చెందిందన్నారు. ఇక్కడి కళాకారులు ప్రతినిత్యం ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వారి కళానైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంటారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ అధికారులు పాల్గొని డప్పు కళాకారులను అభినందించారు.