అవ‌య‌వ దానంలో తెలంగాణ దేశంలోనే నెంబ‌ర్ వ‌న్‌ - MicTv.in - Telugu News
mictv telugu

అవ‌య‌వ దానంలో తెలంగాణ దేశంలోనే నెంబ‌ర్ వ‌న్‌

November 26, 2017

ఆరోగ్యంగా జీవించండి…అవ‌య‌వ దానం చేయండి..మ‌రొక‌రికి ప్రాణ‌ దాత‌గా నిల‌వండని ప్రజ‌ల‌కు పిలుపునిచ్చారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి ల‌క్ష్మారెడ్డి. అవ‌య‌వ దానంలో తెలంగాణ దేశంలోనే నెంబ‌ర్ వ‌న్‌గా నిలిచింద‌ని, ఈ మేర‌కు అవార్డుని కూడా స్వీక‌రిస్తున్నట్లు మంత్రి తెలిపారు. జీవ‌న్‌దాన్‌, మ్యాక్స్ క్యూర్ హాస్పిట‌ల్స్ మ‌రికొన్ని సంస్థ‌ల భాగ‌స్వామ్యంతో హైద‌రాబాద్ న‌గ‌రంలోని నెక్లెస్‌రోడ్డులో గ‌ల పీపుల్స్‌ప్లాజాలో అవ‌య‌వ దానంపై అవ‌గాహ‌న‌, చైత‌న్య, వాక్‌ని మంత్రి ల‌క్ష్మారెడ్డి ప్రారంభించారు. 

ఈ సంద‌ర్భంగా మంత్రి ల‌క్ష్మారెడ్డి మాట్లాడుతూ‘ప్రజ‌లు సుఖ సంతోషాల‌తోపాటు ఆరోగ్యంగా జీవించాల‌ని’ అన్నారు. ప్రతి ఒక్కరూ అందుకు త‌గ్గట్లుగా త‌మ అల‌వాట్లను, జీవ‌న విధానాన్ని మార్చుకోవాల‌న్నారు. ఆరోగ్యమే మ‌హా భాగ్యమ‌ని మ‌న పెద్దలు ఊరికే చెప్పలేద‌న్నారు. ఆరోగ్యంగా ఉండ‌ట‌మంటే డ‌బ్బులు సంపాదించుకోవ‌డం, ఆదా చేసుకోవ‌డం కంటే ఎక్కువ అన్నారు. అవ‌య‌వ దానం అన్ని దానాల్లోకి అత్యంత విలువైన అరుదైన దానంగా మంత్రి చెప్పారు. 

అయితే స‌మాజంలో ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న విధానం మారడం వ‌ల్ల అరుదైన ఆరోగ్య స‌మ‌స్యలు కూడా ఉత్పన్నమ‌వుతున్నాయ‌ని మంత్రి అన్నారు. గుండె, కిడ్నీ, లివ‌ర్ వంటి అనేక స‌మ‌స్యలు వ‌స్తున్నాయ‌న్నారు. ప్రమాదాల్లో కొన్నిఅవ‌య‌వాలు దెబ్బతిన‌డం కూడా మ‌నం చూస్తున్నామ‌న్నారు. ఇలాంటి సంద‌ర్భాల్లో ఆరోగ్యంగా జీవించే వ్యక్తులు ఆరోగ్య క‌ర‌మైన అవ‌య‌వాల‌ను క‌లిగి ఉంటార‌ని, అలాంటి వారు త‌మ జీవితానంత‌రం త‌మ అవ‌య‌వాలు దానం చేస్తే, ఆ అవ‌య‌వాలు అవ‌స‌ర‌మున్న వాళ్ళకి దానం చేస్తే మ‌రో ప్రాణం నిల‌బెట్టిన వాళ్ళమ‌వుతామ‌న్నారు. జీవితం అరుదైన‌ద‌ని, ఇలాంటి జీవితానికి అర్థం ఉండాలంటే జీవితానంత‌రం కూడా బ‌తికి ఉండే అరుదైన అవ‌కాశం ఆవ‌య‌వ దానం ద్వారా ల‌భిస్తుంద‌ని మంత్రి చెప్పారు. తాను కూడా గ‌తంలో అవ‌య‌వ‌దానం చేస్తాన‌ని చెప్పాన‌ని మంత్రి ల‌క్ష్మారెడ్డి తెలిపారు. 

సోమ‌వారం ఢిల్లీలో జ‌రిగే ఒక కార్యక్రమంలో ఈఅవార్డుని మ‌న అధికారులు అందుకుంటున్నార‌న్నారు. ప్రజ‌లు వ్యాధుల మీద అవ‌గాహ‌న‌తో ఉండాల‌ని, అవి రాకుండా చూసుకోవాల‌ని, ఒక‌వేళ వ్యాధులు వ‌స్తే ప్రాథ‌మిక ద‌శ‌లోనే గుర్తించాల‌ని, ఆ త‌ర్వాత వైద్యం చేయించుకుంటే ప్రాణ న‌ష్టం వ‌ర‌కు స‌మ‌స్యలు రావ‌ని మంత్రి తెలిపారు. ఈ సంద‌ర్భంగా నిర్వహించిన 10కె ర‌న్‌లో విజేత‌ల‌కు మంత్రి ల‌క్ష్మారెడ్డి అవార్డులంద‌చేశారు.