తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్.. పైరసీ సినిమాల ప్రదర్శన - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్.. పైరసీ సినిమాల ప్రదర్శన

April 16, 2018

ఒక సినిమా నిర్మాణం అంటే ఎన్నో అవాంతరాలను దాటి ముందుకు సాగాలి. నిర్మాత, నటులు, దర్శకుడి దగ్గర్నుంచి ఆఫీస్ బాయ్ వరకు ఎంతో కష్టపడాలి.  కానీ వాళ్ళ కష్టాన్ని పైరసీకారులు బూడిదపాలు చేస్తున్నారు. సినిమా విడుదలైన క్షణాల్లో అసలైన కాపీకి ధీటుగా ఇంటర్నెట్లో ప్రత్యక్షమయ్యే పైరసీ కాపీలు ఇప్పుడు కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. సినిమా రంగానికి పట్టిన పైరసీ భూతం అటూ ఇటూ తిరిగి ఇప్పుడు ఆర్టీసీ బస్సులో ప్రత్యక్షమైంది. అది కూడా తెలంగాణ బస్సులో. తాజాగా హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళుతున్న టీఎస్ ఆర్టీసీ వోల్వో  బస్సులో నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం ‘ కృష్ణార్జున యుద్ధం ’ సినిమాను ప్రదర్శించారు.సినిమా విడుదలై రెండు రోజులు కూడా కాలేదు అప్పుడే పైరసీనా అంటూ ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. పైరసీని అరికట్టాలని పిలుపునిస్తున్న ప్రభుత్వ బస్సులోనే ఇలా పైరసీ వీడియోను ప్రదర్శించటం ఎంత వరకు న్యాయం అని ప్రశ్నించాడు. మీ యంత్రాంగమే విఫలమవుతూ ఓ సామాన్యుణ్ణి పైరసీ అరికట్టాలని ఎలా ఆపగలరని అడిగాడు. సినిమా విడుదలై బాగా ఆడితేనే డబ్బులు వస్తాయి. ఆడకపోతే రావు. కొన్ని మంచి సినిమాలు ఇలా పైరసీకి గురై నిర్మాతలకు నష్టాలను తెచ్చి పెడుతున్నాయి. కాగా దీనిమీద చర్యలు తీసుకోవాలని కేటీఆర్ ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ పనిలో వున్న ఆర్టీసీ యంత్రాంగం ఇంత వరకూ పైరసీ కాపీని ప్లే చేసిన వారిని గుర్తించలేదు. అది హైదరాబాద్ బస్సా లేకపోతే ఇతర జిల్లాలకు చెందినదా.. ఇతరులకు చెందిన బస్సా అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఇంకా ఈ అంశం మీద విచారణ కొనసాగుతుందని ఆర్టీసీ అధికారులు అంటున్నారు.