mictv telugu

గుండెనొప్పిలోనూ బాధ్యత మరవని ఆర్టీసీ డ్రైవర్

January 23, 2019

బస్సు నడుపుతున్న ఆర్టీసీ డ్రైవర్‌కు ఉన్నట్టుండి ఛాతీలో నొప్పి రావడంతో స్టీరింగ్‌పైనే ఒరిగిపోయాడు. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు అతనికి ప్రథమ చికిత్స అందించి హాస్పిటల్‌కు తరలించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మంగళవారం రోజు పెద్దపల్లి జిల్లా 8 ఇంక్లైన్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. గోదావరిఖని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 8 ఇంక్లైన్ కాలనీ మీదుగా హైదరాబాద్ బయలుదేరింది.

Telugu News telangana rtc driver got heart pain while driving, passengers saved his life .

బస్సు రాఘవపూర్ సమీపంలోకి రాగానే డ్రైవర్‌ మహేందర్‌కు ఛాతీ భాగంలో నొప్పి మొదలైంది. తీవ్రమైన గుండెనొప్పితో స్టీరింగ్‌పైనే ఒరిగాడు.  పరిస్థితి చూసి అప్రమత్తమైన ప్రయాణికులు 108 వాహనానికి ఫోన్ చేశారు. కానీ 108 వాహనం సకాలంలో రాకపోవడంతో ఏం చేయాలో ఎవరికీ తోచలేదు. అదృష్టవశాత్తు అదే బస్సులో సింగరేణి డాక్టర్ చంద్రశేఖర్ ప్రయాణిస్తున్నాడు. ఆయన వెంటనే స్పందించి…డ్రైవర్‌ను ప్రయాణికుల సీటులో పడుకోబెట్టారు. అనంతరం ప్రథమ చికిత్స అందించి ప్రాణాపాయం నుంచి తప్పించారు. అనంతరం డ్రైవర్‌ను పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే మెరుగైన వైద్యం కోసం అక్కడి నుండి కరీంనగర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఐసీయూలో అతనికి చికిత్స అందిస్తున్నారు. సకాలంలో ప్రయాణికులు అప్రమత్తమవడం, డా.చంద్రశేఖర్ సరైన సమయంలో ప్రథమ చికిత్స అందించడంతో ప్రాణాలకు ముప్పు తప్పిందంటున్నారు.

Telugu News telangana rtc driver got heart pain while driving, passengers saved his life