తెలంగాణ  రైతు సమన్వయ సమితి ఏర్పాటు - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ  రైతు సమన్వయ సమితి ఏర్పాటు

February 23, 2018

తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి ’ పేరిట రాష్ట్రంలో కొత్త కార్పొరేషన్ ప్రారంభిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయాభివృద్ధి – రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను క్షేత్రస్థాయికి తీసుకుపోవడంలో ఈ కార్పొరేషన్ కృషి చేస్తుంది . 30 జిల్లాల రైతు సమన్వయ సమితిలతో పాటు తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితిని ఏర్పాటు చేసారు. రాష్ట్రంలో 2,630 రైతు వేదికలను నిర్మించాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. రైతులకు నిరంతరం అవగాహన సదస్సులు నిర్వహించడానికి, వారు చర్చించుకుని అభిప్రాయాలను పంచుకోవడం కోసం ఈ వేదికలను వినియోగించాలని పేర్కొన్నారు.

దీని విధివిధానాలు ఖరారు చేస్తూ గురువారం రాత్రి జీవో జారీచేసింది ప్రభుత్వం.

ఈ సమితికి  మొదటి డైరెక్టర్లుగా సి. పార్థసారధి, డా ఎం. జగన్మోహన్, ఎల్. వెకంట్రామ్ రెడ్డి, జి. లక్ష్మి బాయిలను నియమించారు. ఈ సమితికి తక్షణ నిధులుగా రూ. 200 కోట్లు కేటాయింపు చేసింది సర్కార్. ప్రతి 5 వేల ఎకరాలకు ఒకటి చొప్పున రైతు వేదికలను వీలైనంత త్వరగా నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్దేశించారు. వేదికల నిర్మాణ బాధ్యతలను మండల రైతు సమన్వయ సమితులు తీసుకోవాలని సూచించారు.  గ్రామ, మండల రైతు సమన్వయ సమితుల మాదిరిగానే త్వరలోనే జిల్లా, రాష్ట్రస్థాయి సమన్వయ సమితులు ఏర్పాటవుతాయని చెప్పారు.

విత్తనం వేసిన దగ్గర నుంచి పంటలకు మద్దతు ధర వచ్చేవరకు ప్రతి దశలోనూ రైతు సమన్వయ సమితులు చురుకైన పాత్ర పోషించేలా వాటికి విధులు, బాధ్యతలు ఉంటాయని సీఎం కేసీఆర్ తెలిపారు. కనీసం 51% బలహీన వర్గాలు, మహిళలు ఉండేలా రైతు సమితుల నిర్మాణం జరుగుతుందన్నారు. 25, 26 తేదీల్లో జరిగే ప్రాంతీయ సదస్సులకు మండల సమితుల సభ్యులతో పాటు ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్‌పర్సన్లు కూడా హాజరుకావాలని సీఎం ఆదేశించారు.