mictv telugu

అక్షరాగ్ని పుట్టింది ఈ రోజే.. అలిశెట్టికి జోహార్

January 12, 2019

కవి అంటే ఎవరు? ‘క’ష్టజీ‘వి’కి ఇరువైపులా నిలబడేవాడే అని జవాబిచ్చాడు శ్రీశ్రీ.. అలిశెట్టి ప్రభాకర్ కూడా కూడా అంతే. అంతకు మించి కూడా. శ్రీశ్రీకి కష్టజీవి అనుభవాలు లేవు. అలిశెట్టి జీవితమంతా కష్టమే. అంతకష్టంలోనూ ఆయన సమాజం గురించి ఆలోచించాడు.  దుర్మార్గ వ్యవస్థ మారాలని తపనపడ్డాడు. సామాన్యుడికి సైతం అర్థమయ్యే, అనుభవానికి వచ్చే అక్షరాలతో, చిత్రాలతో.. సమాజానికి అంటిని నానా రకాల మకిలిని తొగించాలని ఆరాటపడ్డాడు.. 39 ఏళ్లకే ఆవిరైపోయాడు.Telugu news Telangana Telugu poet and artist Alisetty prabhakar birth anniversary known for his shot and thought provoking poemsఅలిశెట్టి జీవితం ఒక తరపు సందిగ్ధ ప్రశ్నల చౌరస్తా. నెహ్రూ సోషలిజం పనిచేయదని తేలిపోయిన కాలం అది. ప్రత్యామ్నాయంగా భావించిన జనతా దళాల్లో మతం వెర్రిపోకడలు పోయింది. ప్రత్యామ్నాయం ఆశనిరాశల మధ్య కొట్టుమిట్టాడుతోంది. స్పందించే ప్రతి హృదయం.. మార్పు కోసం ఆరాటపడింది. తలకిందుల వ్యవస్థను సరిచేయాలని, అభ్యాగ్య జీవుల కన్నీరు తుడవాలని ఆరాటపడ్డాయి. తమ కలాలను, గళాలను ఆయుధాలుగా ఎక్కుపెట్టి సాంస్కృతిక యుద్ధం ప్రకటించాయి. అలిశెట్టి తొలి అడుగులు వేశాడు. అలతి అలతి పదాలతో సూటిగా, ఘాటుగా, ఆర్ర్దంగా సాగే కవితా ప్రస్థానం మొదలైంది. ఎర్ర పావురాలు (1978), మంటల జెండాలు (1979), చురకలు (1981), రక్త రేఖ (1985), ఎన్నికల ఎండమావి (1989), సంక్షోభ గీతం (1990), సిటీ లైఫ్ (1992) ఆయన కవితాశక్తికి నిదర్శనం. అచ్చుకాని మరెన్నో కవితలు కాలగర్భంలో కలిసిపోయాయి.Telugu news Telangana Telugu poet and artist Alisetty prabhakar birth anniversary known for his shot and thought provoking poemsఅలిశెట్టి ప్రభాకర్ 1956 జనవరి 12న ఉద్యమాల జగిత్యాలలో కన్నుతెరిచాడు. లోకం తెలిసినప్పుటి నుంచే కష్టాలకు అలవాటు పడ్డాడు. 11 ఏళ్ల పసితనంలోనే కుటుంబ భారాన్ని తలకెత్తుకున్నాడు. చిత్రలేఖనం, ఫొటోగ్రఫీలో బతుకు తెరువు వెతుక్కున్నాడు. విలువలతో రాజీపడే మనిషి కాకపోవడంతో బతుకంతా యుద్ధమే అయిపోయింది. అయినా మొక్కవోని ఆత్మాభిమానంతో ముందుకు సాగాడు. నగర పద్మవ్యూహంలో అడుగుపెట్టాడు.

తనే అన్నట్లు

నగరం అర్థంకాని రసాయశాల

నగరం చిక్కు వీడని పద్మవ్యూహం

ప్లాస్టిక్దో, ప్రకృతిసిద్ధమైందో

తెలియని పువ్వులాంటిదే నగరంలో

ఎదుటివారి నవ్వు!

హైదరాబాద్ నగరం జీవితం అలిశెట్టిని కోతపెట్టింది. తనలాంటి బడుగు జీవులతో సాహానుభూతితో ఆయన కవితాసంద్రమై విరుచుకుపడ్డాడు.

Telugu news Telangana Telugu poet and artist Alisetty prabhakar birth anniversary known for his shot and thought provoking poems

తను శవమై.. ఒకరికి వశమై..

తనువు పుండైఒకడికి పండై..

ఎప్పుడూ ఎడారైఎందరికో ఒయాసిస్సై..

ఈ పన్నెండు పదాలు చాలు అలిశెట్టి కవితాశక్తి సాంద్రతను చాటడానికి.

అలిశెట్టిలో ఎంత ఆవేశంలో ఉందో అంత సున్నితత్వమూ ఉంది. భార్య భాగ్యలక్ష్మి గురించి

‘‘కలగా పులగంగా కలసిపోయిన రోజుల్లో
ఇంచుమించు ఒకే కంచంలో
ఇంద్రధనస్సుల్ని తుంచుకుని తిన్న రోజుల్లో
మా గుండెల్లో సమస్యలు మండని రోజుల్లో
సిగరెట్‌ పీకలాంటి నన్ను
సిగలో తరుముకొని
గాజు కుప్పెల్లాంటి నా కళ్ళలోనే
ఆశల అగరొత్తులు వెలిగించుకుందే తప్ప
తులతూగే ఐశ్వర్యమో
తులం బంగారమో కావాలని
ఏనాడూ ప్రాధేయ పడలేదు అని అంటాడు.

అలిశెట్టి స్పందించని సామాజిక అంశం లేదు.

గుండెల్లో మెత్తగా దిగబడే

కాగితపు కత్తి కరెన్సీ నోటు..

ఎన్నికల్లో ఓట్లడుక్కునే చిప్ప

ప్రగతి వెంట్రుకలు మొలవని..

వాడు ముందే వానపాము

మరి ముడ్డెటో మూతెటో..’  అన్నాడు అలిశెట్టి. ప్రజలను కన్నీళ్లపాలు చేస్తున్న ఈ ప్రజాస్వామ్యంపై ఆయనకు నమ్మకం లేదు. తళుకు బెళులకు సినిమారంగంపైనా మోజు లేదు. ఆయన్ని తిరస్కరణ భావనతో సాగిన జీవితం. మనిషిని చిదిమేసే ప్రతిదాన్నీ ఆయన తిరస్కరించాడు. చివరకు 1992 జనవరి 2న క్షయకు బలైపోయాడు. తన పదచిత్రాలతో, చిత్రాలతో ఒక తరం పాఠకుల్లో ఆలోచనరేపి, తన తర్వాతి తరాలకు స్ఫూర్తిగా నిలిచన అలిశెట్టి భౌతికంగా మన మధ్యలేకపోయినా ఆత్మికంగా సజీవంగానే ఉన్నాడు.