mictv telugu

పాఠకులకు F2 అగ్నిపరీక్ష.. అర్థం కావాలంటే చూడాల్సిందే..

February 12, 2019

తెలుగు జర్నలిజానికి ఘనమైన చరిత్ర ఉంది. గ్రాంథికం నుంచి వ్యావహారిక భాష వరకు సాగిన ప్రస్థానంలో ఎన్నో అపూర్వ ఘట్టాలకు అది సాక్షి. పాఠకులకు సమాచారంతోపాటు, విజ్ఞానం, వినోదం ఇవ్వడానికి ఒక్కో పత్రిక ఒక్కో రకంగా ప్రయత్నించి విజయవంతం అయ్యాయి. పనిలో పనిగా తెలుగు భాషను కూడా సంపద్వంతం చేశాయి.

తెలుగు పత్రికలు, ముఖ్యంగా దినపత్రికలు ప్రజల జీవితంలో అవిభాజ్యం. సమాజానికి అవి అద్దం పడతాయి. అయితే కొన్నేళ్లుగా ఆ అద్దంలో మసకలు ఏర్పడుతున్నాయి. తాము చూసిందే జనం కూడా చూడాలని పత్రికల యాజమాన్యాలు అప్రకటిత హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ‘మేం ఏమైనా రాస్తాం.. అర్థం కాకపోతే మీదే తప్పు.. మీరు సినిమాలు, యూట్యూబు, ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ వంటివన్నీ చూసి నాలెడ్జి సంపాదించుకుని అర్థం చేసుకుని చావండి.. ’ అని వెటకరిస్తున్నాయి. వాటి వెటకారాలు, హంసపాదులకు లెక్కలేదు. మచ్చుకు రెండు చూద్దాం.Telugu news Telugu print media cine mania in titles and information peeks insanity with kattappa and f2 budgent

ఇది F2 బడ్జెట్..

ఈ నెల 1న కేంద్రం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌పై అత్యధిక జనాదరణగల ప్రముఖ దినపత్రకలో ఓ పేజీలో బ్యానర్‌గా వచ్చిన వార్తకు పెట్టిన శీర్షిక ఇది. సినిమాలు, టీవీలు అతిగా చూసేవాళ్లు F2 అంటే.. (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) సంకాత్రి అల్లుళ్లు.. అనే సినిమా అని సులభంగానే అర్థం చేసుకుంటారు. ఎటొచ్చీ, సినిమాలు అంతగా చూడనివారికి ముఖ్యంగా వృద్ధులకు ఇది అర్థం కాదు. మూడు కాలాల వార్తలో ఎక్కడా F2 చిత్రం ప్రస్తావన లేదు. కొత్తదనం కోసం ఈ శీర్షిక పెట్టిన పాత్రికేయులు.. ఆ సినిమా పేరు ప్రస్తావించకుండా.. అందులో మగవాళ్ల ఆలోచన, పెళ్లి ముందు జీవితం, పెళ్లి తర్వాత జీవితం.. అంటూ అతిగా మనసు పాడుచేసుకుని బడ్జెట్‌కు ఆ సినిమాలోని సారాంశాన్ని కలిపికొట్టి రంగరించారు. సినిమా గురించి, అందులోని విషయం గురించి తెలిస్తే తప్ప ఈ వార్త మింగుడు పడదు.

కట్టప్ప అరెస్ట్..

 

బాహుబలి సినిమాలో ‘కట్టప్ప’గా నటించి పేరు తెచ్చుకున్న సత్యరాజ్ అరెస్ట్ అయ్యారని వచ్చిన నకిలీ వార్తకు పెట్టింది పేరు. నకిలీ వార్త అన్న విషయాన్ని పక్కన పెడితే.. ‘కట్టప్ప’ అరెస్ట్ అని రాయడం పాత్రికేయసినీ పైత్యానికి పరాకాష్ట. బాహుబలి సినిమాను చూడని వాళ్లు కూడా ప్రపంచంలో ఉంటారు. దాన్ని చూడాలని సుప్రీం కోర్టు రూలేమీ లేదు. నమ్మకంగా పనిచేసే వారి గురించి, కుక్కల గురించి రాసిన వార్తలకు ‘యజమానిని కాపాడిన కట్టప్ప’, అని ‘అమెరికాలో కట్టప్ప’ అని శీర్షికలు తగలేస్తున్నారు. పోనీ, ఆ వార్తల్లో కనీసం ఒకచోటైనా బాహుబలి సినిమా ప్రస్తావన ఉందా అంటే అసలుండదు. పాఠకులకు అన్నీ తెలుసు కదా అన్నది సదరు శీర్షికా రచయిత వాదన.

ఇక వార్తల్లో రంగరిస్తున్న సినిమా పాటలు, డైలాగుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ‘సారొస్తారు.. ’, ‘సింహం సింగిల్‌గానే…’, ‘చూడు ఒకవైపే చూడు..’, ‘చిట్టినాయుడు.. ’ వంటి సినీపదార్థాలు… పాఠకులందరికీ అర్థమయ్యేవి కావు. వాటిని అంతగా కోరికోరి దట్టించాలనుకుంటే ఆ కాస్త పరిచయమైనా ఇస్తే పాఠకులు ప్రసాదంగా కళ్లకద్దుకుని తరిస్తారు. ఆ చాన్సు కూడా ఇవ్వకపోతే వాళ్ల పాపాన వాళ్లే పోతారు, తెలుగు సినీపాత్రికేయ జెండా అంతరిక్షాన్ని ముద్దాడి రెపరెపలాడిపోతుంది..