తెలుగు వికీపిడియన్ ప్రణయ్ రాజ్... ప్రపంచ రికార్డు ! - MicTv.in - Telugu News
mictv telugu

తెలుగు వికీపిడియన్ ప్రణయ్ రాజ్… ప్రపంచ రికార్డు !

September 13, 2017

ఏదైనా సాధించాలనుకునే యువతకు ఈ యువకుడు ఆదర్శమనే చెప్పుకోవాలి. అతనే మోత్కూర్ మండల కేంద్రానికి చెందిన తెలుగు వికీపీడియా రచయిత ప్రణయ్ రాజ్ వంగరి వికీపీడియా రచనలో ప్రపంచ రికార్డు సాధించాడు. గత 4 సంవత్సరాలుగా తెలుగు వికీపీడియాలో వ్యాసాలు రాస్తున్న ప్రణయ్ ‘వికీవత్సరం’ అనే కాన్సెప్ట్ తో 365రోజులు – 365 వ్యాసాలు రాసి, ప్రపంచం మొత్తంలో ఈ ఘనత సాధించిన మొదటి వికీపీడియన్ గా చరిత్ర సృష్టించారు. మంత్రి కేటీఆర్ ప్రణయ్ ను ప్రత్యేకంగా అభినందించారంటే అర్థం చేసుకోవచ్చు ప్రణయ్ వికీ మీద పెట్టిన ఎఫర్ట్ ఎంతటిదో. 2016, సెప్టెంబర్ 8న ‘100వికీడేస్’ 100రోజులు – 100వ్యాసాలు అనే కాన్సెప్ట్ ను ప్రారంభించిన ప్రణయ్, తెలుగు వికీపీడియాలో ప్రతిరోజు ఒక వ్యాసం చొప్పున రాస్తూ 2017, సెప్టెంబర్ 7న ‘వికీవత్సరం’ పూర్తిచేశాడు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్.టి.ఆర్. ట్రస్టులో నిర్వహించిన వికీపీడియా శిక్షణా శిబిరంలో అసఫ్ బార్టోవ్ (వికీమీడియా ఫౌండేషన్ సీనియర్ ప్రోగ్రాం ఆఫీసర్), ఇతర తెలుగు వికీపీడియన్లు ప్రణయ్ ను అభినందిస్తూ సత్కరించారు. ఇది ప్రపంచంలోకెల్లా మొట్టమొదటి ‘వికీవత్సరం’ అని పలువురు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ప్రణయ్ మాట్లాడుతూ… తెలుగు వికీపీడియన్ గా ‘వికీవత్సరం’ పూర్తిచేయడం చాలా ఆనందంగా ఉందని, ఇందుకు సహకరించిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశాడు. మొదట్లో 100వికీడేస్ ఛాలెంజ్ పూర్తిచేయడమే అసాధ్యంగా తాను భావించానని, అది పూర్తిచేసి ‘వికీవత్సరం’ కాన్సెప్ట్ ను రూపకల్పన చేశానన్నాడు. ‘వికీవత్సరం’ ఛాలెంజ్ ప్రారంభించిన తరువాత తను నాటక ప్రదర్శనల కోసం చాలా ప్రాంతాలకు పర్యటించాల్సివచ్చిందని, ఫిబ్రవరి 15న తన పెళ్లికూడా జరిగిందని, అయినా కూడా తెలుగు వికీపీడియాలో వ్యాసం రాయడం ఆపలేదని తెలియజేస్తూ… తన పెళ్లిరోజున వ్యాసం రాయడంతోపాటుగా తన భార్యతో వికీపీడియాలో ఖాతా తెరిపించానని తెలిపాడు. కష్టపడే వారికి ఖచ్చితంగా ఫలితం దక్కుతుందని రుజువు చేశాడు ప్రణయ్.

365రోజుల పాటు రోజుకో వ్యాసం రాసే ప్రయత్నం సెప్టెంబర్ 7న 365 రోజుకు చేరుకోగా, ప్రణయ్ తాను దీనిని ఇంతటితో ఆపనని ఈ యజ్ఞాన్ని 500 రోజులకు, వీలైతే వెయ్యిరోజులకు కొనసాగిస్తానని చెప్పారు. 100 రోజల పాటు కేవలం మహిళల గురించి, మహిళలపై వ్యాసాలు, మరో 100 రోజుల పాటు ప్రత్యేకించి తెలంగాణకు సంబంధించిన వ్యాసాలు సృష్టించిన ప్రణయ్ తన వికీవత్సర (365వ) వ్యాసంగా తెలంగాణ సంస్కృతి గురించి వ్యాసాన్ని సృష్టించారు. ఈ సందర్భంగా ఆయనతో సముదాయ సభ్యులు కేక్ కోయించి, వేడుక చేశారు. అసఫ్ మాట్లాడుతూ ప్రణయ్ తన పెళ్ళి జరిగిన రోజున కూడా వికీపీడియాలో వ్యాసం రాసే నియమాన్ని తప్పకుండా రాయడం విశేషమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రణయ్ రాజ్ తోపాటు అసఫ్ బార్టోవ్ (వికీమీడియా ఫౌండేషన్ సీనియర్ ప్రోగ్రాం ఆఫీసర్), టి. విష్ణువర్ధన్ (సి.ఈ.ఓ., ఎన్.టి.ఆర్.) లతోపాటు ఇతర తెలుగు వికీపీడియన్లు పాల్గొన్నారు.

ఇటలీ వికీపీడియా అంతర్జాతీయ సదస్సుకు ప్రణయ్ రాజ్ కు ఆహ్వానం :

ఇటలీలో జరిగే వికీపీడియా అంతర్జాతీయ సదస్సు (వికీమేనియా 2016) లో పాల్గొనడానికి తెలుగు వికీపీడియాకు చెందిన ప్రణయ్ రాజ్ వంగరికి ఆహ్వానం లభించింది. ప్రణయ్ రాజ్ గత మూడు సంవత్సరాలుగా తెలుగు వికీపీడియాలో చురుగ్గా ఉంటూ వివిధ అంశాలను గురించిన వ్యాసాలు తెలుగు వికీపీడియాలో రాస్తూనే.. వికీపీడియా శిక్షణా శిబిరాలు, సమావేశాలు నిర్వహిస్తున్నాడు. అంతేకాకుండా తెలుగు వికీపీడియా గురించి అందరికి తెలిసేలా వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం కలిపిస్తున్నాడు. ఇలా, ప్రణయ్ రాజ్ కృషిని గుర్తించిన వికీమీడియా ఫౌండేషన్ వారు ప్రతి ఏటా నిర్వహించే వికీపీడియా అంతర్జాతీయ సదస్సులో భాగంగా ఈ సంవత్సరం ఇటలీలో జరుగుతున్న సదస్సుకు అవకాశం ఇచ్చారు.

దీనికి సంబంధించిన ప్రయాణ ఖర్చులు మరియు భోజన వసతి అంతా వికీమీడియా ఫౌండేషన్ వారే భరిస్తున్నారు. జూన్ 22 నుండి 26వ తేదీ వరకు జరుగబోతున్న ఈ సదస్సుకు వివిధ దేశాలనుండి 550 మందికిపైగా వికీపీడియన్లు అప్లై చేశారు. ఈ విషయమై ప్రణయ్ రాజ్ వంగరి మాట్లాడుతూ..
‘‘చిన్నప్పటినుండి కళారంగంపై ఉన్న ఆసక్తితో హైదరాబాద్ వెళ్లి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నాటకరంగం (థియేటర్ ఆర్ట్స్) లో పి.జి. పూర్తిచేసి ప్రస్తుతం ఎం.ఫిల్ చేస్తున్నాను. నా రీసెర్చ్ లో భాగంగా తెలుగు నాటకరంగం గురించిన వివరాలను తెలుసుకోవలసివచ్చింది. అంతకుముందే ఇంగ్లీష్ వికీపీడియాతో పరిచయం ఉండడంవల్ల తెలుగు వికీపీడియాలో వెతకడం జరిగింది. కాని అనుకున్న సమాచారం లభించలేదు. అన్ని భాషల వికీపీడియల్లోకంటే తెలుగు వికీపీడియాలో చాలా తక్కువ సమాచారం ఉంది. ఎలాగైనా తెలుగు వికీపీడియాలో పూర్తి సమాచారం ఉండేలా కృషి చేయాలనిపించింది.

దాంతో మార్చి 8, 2013లో వికీపీడియాలో లాగిన్ అయ్యి, తెలుగు నాటకరంగానికి సంబంధించిన వ్యాసాలను రాయడం ప్రారంభించాను. అలా ప్రారంభమైన నా వికీ రచన… ఒక్క నాటకరంగ వ్యాసాలకే పరిమితంకాకుండా గ్రామాలు, చరిత్ర, సంస్కృతి, వ్యక్తులు, సినిమా మొదలైన అంశాలకు సంబంధించిన వ్యాసాలు కూడా రాస్తున్నాను. అయితే వికీలో రాయడం వల్ల డబ్బులు రాకపోయనా… నాకు తెలిసిన సమాచారాన్ని తెలుగు వికీపీడియా ద్వారా భావి తరాలకు అందిస్తున్నాననే తృప్తి కలుగుతుంది. అంతేకాకుండా, నేను ఎక్కడకు వెళ్లినా తెలుగు వికీపీడియన్ అనే ప్రత్యేక గుర్తింపు కూడా లభిస్తుంది.

తెలుగు వికీపీడియాలో ప్రస్తుతం రాస్తున్న 30 మంది ఆక్టీవ్ వికీపీడియన్లలో తెలంగాణ ప్రాంతంనుండి ప్రథమ స్థానంలో ఉన్నాను. తెలంగాణకు సంబంధించిన సమాచారం చాలా తక్కువగా ఉంది. తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ గారి సూచన మేరకు తెలంగాణ చరిత్ర, సంస్కృతి, వ్యక్తుల గురించి వికీపీడియాలో వ్యాసాలు రాసే ప్రయత్నంలో ఉన్నాను. కాని, ఇంత సమాచారాన్ని ఏ ఒక్కరిద్దరో రాయాలంటే సాధ్యం కాదు. ఎవరైన ఉత్సాహవంతులు వికీ వ్యాసాల రచనకు ముందుకువస్తే బాగుంటుంది. నా సెల్ నెంబర్. 9948 152 952.
వికీపీడియా కోసం నేను చేస్తున్న పనులు
తెలుగు వికీపీడియా గురించి తెలుగు వారందరికి తెలియజేయడంకోసం ప్రతిరోజు, ఆరోజుకు సంబంధించి గతంలో జరిగిన సంఘటనలు, ప్రముఖుల జనన మరణాలు గురించిన సమాచారాన్ని ‘‘చరిత్రలో ఈరోజు’’ పేరుతో ఫేస్ బుక్ లో అప్ డేట్ చేస్తున్నాను.

తెలుగు వికీపీడియా నెలవారి సమావేశాలు నిర్వహిస్తున్నాను.
తెలిసిన వారికి, నా ఫ్రెండ్స్ కు వికీపీడియాను పరిచయం చేసి, వికీలో వ్యాసాలు రాయడంపై శిక్షణ ఇస్తున్నాను.
ఫలితాలు
బెంగళూరులో జరిగిన వికీ శిక్షణా శిబిరంలో తెలుగు వికీపీడియా తరపున పాల్గొని, వికీపీడియా వ్యాసాల రచనలో మెళకువలు నేర్చుకోవడంతోపాటు, ఇతర రాష్ట్రాల వికీపీడియన్లను కలవడం జరిగింది.
తెలుగు వికీపీడియా దశమ మరియు 11వ వార్షికోత్సవాలకు ప్రధాన కార్యదర్శి వ్యవహరించాను.
బెంగళూరులో జరిగిన అంతర్జాతీయ వికీపీడియన్ల సమావేశంలో తెలుగు వికీపీడియా తరపున పాల్గొని తెలుగు వికీపీడియా అభివృద్ధి గురించి చర్చించడం జరిగింది.

కలకత్తాలో జరిగిన బెంగాల్ వికీపీడియా దశమ వార్షికోత్సవానికి తెలుగు వికీపీడియా తరపున పాల్గొని, పరస్పర అవగాహనలతో వికీపీడియాల్లోని పద్ధతుల గురించి చర్చించడం జరిగింది.
ఇటలీలో జరుగుతున్న వికీపీడియా అంతర్జాతీయ సదస్సుకు నన్ను ఆహ్వానించినందుకు చాలా ఆనందంగా ఉంది. వివిధ భాషల వికీపీడియాల్లో జరుగుతున్న కార్యక్రమాలను తెలుసుకోవడానికి మరియు తెలుగు వికీపీడియాలో చేస్తున్న కార్యక్రమాలను ఇతర భాషల వికీపీడియన్లకు తెలియజేయడానికి సదస్సు చాలా ఉపయోగపడుతుంది. నాకు సహకరించిన అందరికి ధన్యవాదాలు’’ అని అన్నాడు.