నాగార్జున సాగర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత..  - MicTv.in - Telugu News
mictv telugu

 నాగార్జున సాగర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. 

February 28, 2018

ఆంధ్రాకు 10.5 టీఎంసీల నీటిని కృష్ణా బోర్డు కేటాయించింది. ఇప్పటివరకూ 10.2టీఎంసీలను కుడికాల్వ ద్వారా విడుదల చేశారు. మరో 0.3 టీఎంసీల నీటిని విడుదల చేయకుండా తెలంగాణ అధికారులు అడ్డుకున్నరంటూ ఆంధ్రా అధికారులు నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు వద్ద ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు రాష్ట్రాల అధికారులు వాగ్వాదానికి దిగారు. ఆంధ్రప్రదేశ్‌ నిర్ణయించిన నీటికంటే ఎక్కువ వాడుకొందని, వెంటనే నీటి విడుదలను నిలిపివేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పేర్కొన్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుందని భావించి, ముందుజాగ్రత్త చర్యగా డ్యామ్‌ వద్ద ఇరురాష్ట్రాల పోలీసులు భారీసంఖ్యలో మోహరించారు. ప్రస్తుతం ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. కాగా నాగార్జునసాగర్‌లలో కనీస నీటిమట్టాల కంటే పైన ఉన్న నీటిలో ఆంధ్రప్రదేశ్‌కు కేవలం 0.56 టీఎంసీ మాత్రమే మిగులు ఉందంటూ బోర్డుకు తెలంగాణ సర్కారు లేఖ రాసింది. కానీ ఇప్పటివరకు నిర్ణయించిన నీటి కంటే ఆంధ్ర ప్రదేశ్ ఎక్కువ వాడుకుందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది.