వంద శవాలను పీక్కుతిన్న రాబందు ఒక్క గాలివానకు చచ్చినట్టు… ఉగ్రవాదులు కూడా ఏ గత్తరతోనో చావాలని ఉగ్రవాద దాడుల్లో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలు కోరుకుంటున్నాయి. 2001లో పార్లమెంట్‌పై దాడితోపాటు.. 2005లో అయోధ్యపై దాడి, రెండేళ్ల క్రితం పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రదాడి, ఉడీ దాడిలో ప్రధాన నిందితుడైన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజహర్ చావు బతుకులతో పోరాడుతున్నాడు. 50 ఏళ్ళ అజహర్ వెన్ను, కడ్నీ సంబంధ వ్యాధులతో, ఏడాదిన్నరగా మంచానికే పరిమితమయ్యాడని భారత ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. అతనికోసం కొంత కాలంగా వెతుకుతున్న ఇంటలిజెన్స్‌కు అతడు పాకిస్తాన్‌లోని సొంతూరులోనే వున్నట్టు తెలిసింది.
మసూద్ బాధ్యతలను అతని తమ్ముళ్ళయిన అథర్ ఇబ్రహీం, రవూఫ్ అస్ఘర్‌లు చూసుకుంటున్నాడు. రవూఫ్ అస్ఘర్ భారత్‌లో, కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. 1999లో కాందహార్ హైజాక్ ఘటనలో మసూద్ అజర్ సోదరుడు ఆథర్ ఇబ్రహం నేతృత్వం వహించాడు. ప్రస్తుతం ఖైబర్ ఫక్తున్ఖ్వా ప్రాంతం నుంచి అప్ఘాన్, బలూచిస్థాన్లపై ఉగ్రదాడులకు అతడు నాయకత్వం వహిస్తున్నాడు. పార్లమెంట్ దాడుల్లో, అయోధ్య దాడుల్లో తమవారిని కోల్పోయిన బాధిత కుటుంబాలు.. మసూద్ అజహర్ మంచంలోనే చచ్చిపోవాలని కోరుకుంటున్నారు. అతణ్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఇండియా, అమెరికా ఐరాసలో ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు చైనా అడ్డుపడుతోంది.