చెల్లినని వచ్చింది.. దోచుకెళ్లింది - MicTv.in - Telugu News
mictv telugu

చెల్లినని వచ్చింది.. దోచుకెళ్లింది

March 6, 2018

దొంగలు కూడా మహా ముదురు నటులు అని ఈ ఘటన నిరూపిస్తోంది. ఏమాత్రం అనుమానం రాకుండా పక్కింటివారి ముందు      ‘ హేమ చెల్లిని ’ అని బురిడీ కొట్టించి తాళంచెవి తీసుకొని ఇంట్లో వున్న నగదు, బంగారంతో ఉఢాయించింది. విస్మయానికి గురిచేస్తున్న ఈ ఘటన ఎర్రగడ్డ ఆనంద్‌నగర్‌లో చోటుచేసుకుంది. సనత్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 1న ఎర్రగడ్డ ఆనంద్ నగర్‌లో నివసించే వెంకటేష్ ఇంటికి తాళం వేసి, తాళం చెవులు పక్కింటివాళ్ళకు ఇచ్చాడు. తన భార్య హేమ వస్తే ఇవ్వమని చెప్పి ఇచ్చి వెళ్ళాడు. అతని మీద ఎప్పటినుంచి నిఘా పెట్టిందో మాయలేడి వెంటనే పక్కింటివాళ్ళ దగ్గరికి వచ్చింది.నేను హేమ చెల్లెలినని, గుర్తుపట్టారా అంటూ నవ్వుతూ కలుపుగోలుగా మాట్లాడింది. ఇంతకుముందు కూడా ఓసారి వచ్చినట్టు నమ్మబలికింది. ఇప్పుడే మా బావ తాళంచెవులు మీకిచ్చి వెళ్ళానని చెప్పారు. ఓసారి ఇవ్వండంటూ ఇంతకూడా తన మీద అనుమానం రాకుండా వీరలెవల్లో నటించింది. అన్నీ తెలిసినట్లుగా చెప్పడంతో నిజమేనని నమ్మిన పక్కింటివారు తాళం చెవులను ఆమెకు ఇచ్చారు. వెంటనే వెంకటేష్ ఇంటితాళం తీసి దర్జాగా లోపలికి వెళ్లింది. 8 తులాల బంగారం, నగదు తీసుకొని మళ్లీ ఎప్పటిలా తాళం వేసి ఉఢాయించింది. తరువాత ఇంటికి వచ్చిన వెంకటేష్, హేమలు ఇల్లు గుల్లవటం చూసి షాకయ్యారు. గుర్తు తెలియని మహిళ వచ్చి దొంగతనం చేసిందని గుర్తించారు. పక్కింటివారి నుంచి విషయం తెలుసుకొని ఆ మేరకు సనత్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితురాలి కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు. నిందితురాలి చిత్రాలను మీడియాకు విడుదల చేస్తూ, నిందితురాలిని గుర్తించిన వారికి తగిన బహుమతి ఇస్తామని ప్రకటించారు.