బ్యాంకు క్యాషియరే బ్యాంకుకు కన్నం వేశాడు - MicTv.in - Telugu News
mictv telugu

బ్యాంకు క్యాషియరే బ్యాంకుకు కన్నం వేశాడు

March 30, 2018

ఎక్కడైనా బ్యాంకులకు దొంగలు కన్నాలు వేయంగా చూశాం కానీ, బ్యాంకు క్యాషియరే పనిచేస్తున్న బ్యాంకుకు కన్నం వేశాడు. అంతా మన చేతుల్లోని వ్యవహారమే కదా డబ్బులతో చక్కా చెక్కేద్దాం అనుకున్నట్టున్నాడు. కడప జిల్లాలోని పోరుమామిళ్ల పట్టణంలోని రంగసముద్రం స్టేట్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా శాఖలో ఈ ఘటన చోటు చేసుకుంది. అందులో క్యాషియర్‌‌గా పని చేస్తున్న  గురుమోహన్‌రెడ్డి రూ.91.49 లక్షలతో పరారయ్యారు. బ్యాంకు మేనేజర్‌ కృష్ణారెడ్డి ఫిర్యాదు చేయగా పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ప్రొద్దుటూరుకు చెందిన గురుమోహన్‌రెడ్డి పోరుమామిళ్ల ఎస్‌బీఐలో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. ఈయన భార్య ఒక ప్రభుత్వ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం చేస్తోంది. గురుమోహన్‌రెడ్డి బ్యాంకులో బంగారు ఆభరణాలకు రుణాలు అందజేస్తుంటారు. తన బంధువుల ఇంట్లో శుభకార్యం వుందని చెప్పి బుధవారం మధ్యాహ్నం తన వెంట తెచ్చుకున్న సంచితో బయటకు వెళ్ళిపోయాడు.పోయినవాడు ఎంత సేపటికి తిరిగి రాకపోవటంతో అనుమానం వచ్చిన బ్యాంక్ మేనేజర్ అతని నెంబర్‌కు ఫోన్ చేశారు. అది నాట్ కవరేజ్ ఏరియా అని చెప్పడంతో అతని కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. వాళ్ళ నంబర్లు కూడా పని చేయకపోవటంతో బ్యాంకు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వెంటనే కడప నుంచి ఎస్‌బీఐ ఉన్నతాధికారులు గురువారం పోరుమామిళ్ళకు వచ్చారు. అధికారుల సమక్షంలో నకిలీ తాళాలతో లాకర్ తెరిచి చూశారు. లాకర్ ఖాళీగా కనిపించింది. అందులో వుండాల్సిన రూ.91.49 లక్షలు, 24 మందికి చెందిన బంగారు ఆభరణాల సంచులు లేనట్లు అధికారులు గుర్తించారు. ఆ 24 మందిలో ఎవరి బంగారం ఎంత వుంది అనేది ఇంకా లెక్క తేలాల్సి వుందని పోలీసులు చెప్పారు. ఖాతాదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. గురువారెడ్డి కాల్‌డేటా ఆధారంగా విచారణ వేగవంతం చేసినట్టు పోలీసులు తెలిపారు.